హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మహాలక్ష్మీ ఉచితబస్సు పథకం ద్వారా తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్ల దీనస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వంలో వినేవారే లేరు. ప్రతిపక్షంలో ఉండగా ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12వేల ఆర్థికసాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చి 32 నెలలైనా ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదు. దీంతో ఆటో యూనియన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 170 మందికిపైగా ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనియన్ల వారీగా ఉద్యమ కార్యరణ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆటో యూనియన్లు రూ.12 వేల ఆర్థికసాయం కోసం నిరసనల బాటపట్టాయి.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఒకో డ్రైవర్‌కు నెలకు రూ.1,000, ఏడాదికి రూ. 12,000 వంతున ఆర్థిక సహాయం అందించాల్సి ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 7, డిసెంబర్ 2023 నుంచి లెక్క కడితే సుమారు 32 నెలలు పూర్తవుతుంది. అయితే, తెలంగాణలో సుమారు ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే చెప్పారు. ఆ లెక్కల ప్రకారం ఇప్పటికి ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.2,000 కోట్లకుపైగా బకాయి పడింది. రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 5 లక్షలకుపైగా ఆటోలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం ఒక్కో ఆటోకు ఒక్కో డ్రైవర్‌ను లెక్క కట్టినా సుమారు రూ.16,000 కోట్ల వరకు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఉచిత బస్సు పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఈఎంఐలు కట్టలేకపోతున్నారని, నిత్యావసర ధరల పెరుగుదలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని, దీంతో పలువురు అప్పుల పాలయ్యారని యూనియన్ల నేతలు చెప్తున్నారు. వివిధ ఆటో యూనియన్ల నివేదికలు, మీడియా కథనాల ప్రకారం.. ఉచిత బస్సు పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఉపాధి కోల్పోయి తీవ్ర మానసిక వేదనతో రాష్ట్రవ్యాప్తంగా 170 మందికిపైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కార్మిక సంఘాలు పేరొంటున్నాయి. ‘మా పొట్ట కొట్టి ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మాకు రోజువారీ బోణీ కావడం లేదు. ఇచ్చిన హామీ ప్రకారం రూ.12,000 ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలి’ అని ఆటో డ్రైవర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే తమను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.