కాజీపేట, జూలై 28 : హక్కుల సాధనకు నిరంతరం ఉద్యమిస్తామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే డివిజన్ సాధన, స్థానిక కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాకు తరలివెళ్తున్న పార్టీ శ్రేణులకు ఆయన మంగళవారం కాజీపేట రైల్వే జంక్షన్లో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వరంగల్‌కు ఎంత చరిత్ర ఎందో.. నిజాంకాలం నాడు ఏర్పాటైన కాజీపేట రైల్వే జంక్షన్‌కు అంత చరిత్ర ఉన్నదని గుర్తుచేశారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వరంగల్ జిల్లాకు సంబంధించి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ అంశాల ఏర్పాటుకు కృషి చేసినట్టు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల 40 ఏండ్ల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కలను సాకారం చేసేందుకు ఎంతో పోరాడామని గుర్తుచేశారు. కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు, కాజీపేట రైల్వే డివిజన్సాధన, ఫ్యాక్టరీకి భూమి ఇచ్చిన బాధితులకు ఉద్యోగ అవకాశాలు, లోకో పైలెట్లు, రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల సాధనకోసం వరంగల్ పశ్చిమ నియోజకవర్గపార్టీ శ్రేణులతో కలిసి ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.