దుల్కర్ సల్మాన్ మలయాళంలో పెద్ద స్టార్. అలాగే తెలుగు ప్రేక్షకులకూ అభిమాన నటుడు. దుల్కర్ తెలుగులో నేరుగా చేసిన మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ చిత్రాలు వసూళ్ల పరంగా వందకోట్ల మార్కును దాటాయి. ఇప్పుడున్న ఏ పరభాషా నటుడికీ దక్కని రికార్డ్ ఇది. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా చేస్తున్నారు. శ్రుతిహాసన్, సాత్విక వీరవల్లి కథానాయికలు. పవన్ సాదినేని దర్శకుడు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలు. మంగళవారం దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలిపాటను మేకర్స్ విడుదల చేశారు.
‘చిట్టి చిట్టి చీమ.. చిట్టి చేతుల్తో అయ్యో రామా.. వంద టన్నుల చెక్కెర మోస్తుందమ్మా..’ అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా, జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరిచారు. రమ్య బెహరా ఆలపించారు. కథలోని సారాంశాన్ని ఈ పాట సాహిత్యంలో మిళితం చేసి రాసినట్టుగా హీరోయిన్ కోణంలో ఈపాట సాగింది.
నక్షత్రాలను తాకాలని కలలు కనే ఓ అమ్మాయి కలను, ఆమె పక్కనే నిలబడి నిశ్శబ్దంగా అండగా నిలిచే అబ్బాయి ప్రేమను ఈ పాట ప్రతిబింబిస్తున్నది. సంప్రదాయ ప్రేమకథలకు భిన్నంగా, ఒక ప్రత్యేకమైన బంధాలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.