పాలకుర్తి, మార్చి21: సాగునీటి రంగంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపుతో ఎవుసం ఆగమవుతున్నది. ఓవైపు నీరు లేక పంటలు ఎండిపోతుంటే, ఉన్నచోట సక్రమంగా వినియోగించడంలో అలసత్వంతో వృథాగా పోతున్నది. ఇందుకు కొత్తపల్లి ఎరుకుల కుంటనే నిదర్శనంగా నిలుస్తున్నది. గొలుసుకట్టు జలవనరుగా ఉన్న ఈ కుంట నిండిన తర్వాత ఈసాలతక్కళ్లపల్లి పెద్ద చెరువుకు వెళ్లాల్సిన నీరు అలుగు పారుతూ ఒర్రెల ద్వారా వృథాగా పోతుండడం అలసత్వానికి అద్దంపడుతున్నది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలో అనేక గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాలే ఆధారంగా జలకళను సంతరించుకుంటూ, రైతులు, సబ్బండవర్గాలకు ఆదరువుగా నిలుస్తుంటాయి.
ఏటా యాసంగిలో ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా వచ్చిన నీరు పాలకుర్తి మండలం కొత్తపల్లి ఎరుకల కుంట నిండి, ఇక్కడి నుంచి కాలువ ద్వారా ఈసాలతక్కళ్లపల్లి పెద్దచెరువుకు తరలివెళ్లేది. ఈ పెద్ద చెరువు కింద ఈసాలతక్కళ్లపల్లి, కొత్తపల్లి, రామరావుపల్లి, పుట్నూర్ గ్రామాల్లో 300 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమయ్యేది. అయితే కొన్నేండ్లుగా ఎరుకల కుంట – పెద్దచెరువు మధ్య కాలువ పూడిక, బండలతో నిండి ఆనవాళ్లు కోల్పోవడం, బాగు చేసే దిక్కులేకపోవడంతో నీటిని తరలించలేని పరిస్థితి ఉంది. దీంతో ఎరుకల కుంట నిండి నీరు వృథాగా పోతున్నది. అలుగుపారుతూ రామారావుపల్లి మంచినీళ్ల మాటులో కలుస్తూ, మళ్లీ అక్కడి నుంచి బండలవాగు మీదుగా గోదావరిలో కలుస్తున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వలో పూడికతీయించి తక్కళ్లపల్లి చెరువుకు నీటిని మళ్లించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.