seed production fields | ధర్మారం, సెప్టెంబర్ 19 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో సాగుచేసిన విత్తనోత్పత్తి క్షేత్రాలను వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త శుక్రవారం సందర్శించారు. ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా వానకాలం సాగుకి ప్రతీ గ్రామానికి ముగ్గురు రైతులకు వరి, పెసర విత్తనాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేశారు.
దొంగతుర్తి, బొట్ల వనపర్తి గ్రామాల్లో రైతులు సాగు చేసిన విత్తనోత్పత్తి క్షేత్రాలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్త డా. యం. రాజేందర్ ప్రసాద్ సందర్శించారు. ఈ క్షేత్ర సందర్శనలో భాగంగా శాస్త్రవేత్త రైతులకు విత్తనోత్పత్తిలో మెళకువలను వివరించారు. ఎప్పటికప్పుడు సస్య రక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి ఏవో భాస్కర్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.