యాసంగి సీజన్ సాగుకు కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. ఈ సీజన్లో 3,04,655 ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశముందని అంచనా వేశారు. అందులో ఎప్పటిలాగే వరిదే అగ్రస్థానంగా కాగా, ఆరుతడి పంటల సాగును గతానికంటే స్వల్పంగా పెంచారు.
కరీంనగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లా రైతులు ఓవైపు వానకాలం పంట ఉత్పత్తులను విక్రయిస్తూనే.. మరోవైపు యాసంగి సాగుకు సిద్ధమయ్యారు. అక్టోబర్లోనే యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇటు పంటలు వేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఒక పక్క ఆరుతడి పంటలు సాగు చేసుకుంటూ వరి నార్లు పోసుకుంటున్నారు. మక్క, పల్లి, తదితర ఆరుతడి పంటలు కూడా సాగవుతున్నాయి. ఈసారి బావులు, బోర్ల కింద పెద్ద మొత్తంలో వరి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోనూ అనుకూలంగా నీరు ఉన్నందున ఆయకట్టు, చెరువుల పారకం ప్రాంతాల్లో కూడా వరి సాగు విస్తరించే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో రైతులు ఎక్కువగా వరికే మొగ్గు చూపుతున్నారు. అక్కడక్కడా దుక్కులు దున్నుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 3,04,655 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని, అందులో 2.65 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని అంచనా వేశారు. ఆరుతడి పంటలకు ఈసారి కాస్త ప్రాధాన్యత పెంచారు. పెసర 80, మినుము 5, జొన్న 50, శనగలు 50, అనుములు 50, పల్లి 500, నువ్వులు 60, పొద్దుతిరుగుడు 380, కందులు 10 ఎకరాల్లో కలిపి 1,205 ఎకరాల్లో సాగు కావచ్చని చెప్పారు. అలాగే, యాసంగి పత్తి 20 ఎకరాలకు ప్రణాళిక వేయగా పొగాకు 500 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఇక ఇతర పంటలను 1,200 ఎకరాల్లో సాగవుతుందని పేర్కొన్నారు.