సరిగ్గా ఏడేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటుతో సరికొత్త అధ్యాయం మొదలైంది. పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. నాలుగు జిల్లాలుగా విడిపోయి నవశకానికి నాంది పడింది. ప్రజల ముంగిట్లోకి పాలన చేరువై, ఏ రంగంలో చూసినా ప్రగతి పరుగులు పెట్టింది. చిన్న జిల్లా కావడంతో పరిధి తగ్గి ప్రజలు, అధికారులకు మధ్య సత్సంబంధాలు పెరిగాయి. అవసరం ఉన్న ప్రతి వ్యక్తి నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్లే వెసులుబాటు కలుగడంతోపాటు క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది.
ఇదే సమయంలో ప్రతి శాఖపైనా నిఘా పెరిగి, మారుమూల ప్రాంతాలకు సత్వర సేవలందడమే కాదు, ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం దొరుకుతున్నది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలు గడపగడపకూ చేరడంతోపాటు ప్రతి పనిలోనూ పారదర్శకత కనిపిస్తున్నది. అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు ఇంద్రభవనాలను తలపిస్తున్నాయి. మండలాలు, పంచాయతీల సంఖ్య పెరిగి, రాజకీయంగానూ అవకాశాలు పెరిగాయి. ఇంకోవైపు ఆయా విభాగాల్లో లెక్కకు మించిన ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ సులభతరమయ్యాయి.
పనులు త్వరగా అవుతాయి
చిన్న జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో చక్కటి పాలన అందుతున్నది. 2016లో 22 జిల్లాలను ఒకే సారి ఏర్పాటు చేయడం హర్షనీయం. ఆ తర్వాత మరిన్ని జిల్లాలు పెంచి ఇపుడు 33 జిల్లాలకు తెచ్చారు. గతంలో ఒక రెవెన్యూ డివిజన్ కంటే తక్కువ మండలాలు ఇపుడు జిల్లాల్లో ఉన్నాయి. ఇది ఎంతో మంచి పరిణామం. దీనివల్ల ఇటు ప్రజలకు పనులు త్వరగా అవుతాయి. అటు అధికార యంత్రాంగానికి పర్యవేక్షణ సులభతరమైంది. సుదూర ప్రాంతాల నుంచి వ్యక్తిగత పనులపై వచ్చి ఆర్థికంగా నష్టపోయే సామాన్యులు ఇప్పుడు చేరువలో ఉన్న జిల్లా స్థాయి కార్యాలయాలకు వెళ్లి ఎంతో సులభంగా పనులు చేయించుకుంటున్నారు.
కలెక్టర్ లాంటి ఉన్నత స్థాయి అధికారికి అన్ని శాఖలను చాలా నిశితంగా పర్యవేక్షించే అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ పథకాలు కూడా నిజమైన లబ్ధిదారులకు అందుతున్నయా లేదా అనేది స్పష్టంగా పరిశీలించే అవకాశం దక్కింది. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం ద్వారా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఇపుడు ప్రజల వద్దకు పాలన వచ్చినట్లుగా ఉంది.
– పెండ్యాల కేశవరెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, కరీంనగర్
కరీంనగర్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న అపార రాజకీయ అనుభం తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఎంతోగానో దోహద పడుతుందని గతంలోనే పలువురు నిపుణులు చెప్పారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే చిన్న జిల్లాల ఏర్పాటు. పెద్ద జిల్లాల ద్వారా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పూర్తిగా అధ్యయనం చేసిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఆనాడు చిన్న జిల్లాల ఏర్పాటును వ్యతిరేకించిన పలువురు..
ఇప్పుడు శభాష్ అంటున్నారు. ఈ నిర్ణయం పరిపాలనా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ రంగం.. ఆ రంగం కాదు, అన్ని రంగాల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ప్రధానంగా ప్రజలకు పాలన చేరువైంది. వీటితోపాటు ప్రగతి పరుగులు పెడుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణను అన్నింటా ఆదర్శంగా నిలిపారు.
తగ్గని వన్నె.. పెరిగిన మండలాలు
కొత్త జిల్లాల ఏర్పాటుతో.. పూర్వ జిల్లా కరీంనగర్ వన్నె తగ్గుతుందని, ఉనికి కోల్పోతుందని విమర్శలు చేశారు. కానీ, నేడు కరీంనగర్‌తో పాటు రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలు అద్భుతంగా ముందుకు వెళ్తున్నాయి. 2016 అక్టోబర్ 11కు ముందు ఉన్న పూర్వ కరీంనగర్.. విభజన పక్రియలో భాగంగా నాలుగు జిల్లాలుగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆనాటి ఉమ్మడి జిల్లాలో 57 మండలాలుండేవి. పరిపాలనా సౌలభ్యం కోసం పునర్విభజనలో భాగంగా పది మండలాలు వరంగల్ సిద్దిపేట, భూపాల్పల్లి జిల్లాల్లో కలిశాయి.
కొత్తగా ఏర్పడిన మండలాలతో కలిపి ప్రస్తుతం కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 63 మండలాలున్నాయి. నిజానికి పూర్వ జిల్లాలోని 57 మండలాల్లో బెజ్జంకి, హుస్నాబాద్, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలోకి, ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మండలాలు వరంగల్ జిల్లాలోకి, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, కాటారం మండలాలు భూపాల్ జిల్లాలోకి వెళ్లాయి. ఈ లెక్కన చూస్తే 47 మండలాలు మాత్రమే ఉండాలి. కానీ, దూర దృష్టితో ఆలోచనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పెద్ద మండలాలను సైతం పరిపాలనా సౌలభ్యం కోసం.. చిన్న మండలాలుగా చేసి కొత్తగా ఏర్పాటు చేసింది. అలా విభజన ప్రక్రియలో పురుడు పోసుకున్న నాలుగు జిల్లాల్లో కొత్తగా 16 మండలాలను ఏర్పాటు చేసింది. వివిధ జిల్లాలు, మండలాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది.
కలెక్టరే మా దగ్గరకు అచ్చిండు
మాది ఆర్అండ్ఆర్ కాలనీ అనుపురం. వేములవాడ మండలం. మిడ్‌మానేరులో మునిగిపోతున్న మా భూములు, మా గోస చెప్పుకోవడానికి ఊరోళ్లందరం కలిసి కరీంనగర్ కలెక్టర్ కార్యాలయానికి పోయినం. కలెక్టర్‌ను కలువనియ్యలేదు. చేతిలో కాగితాలను అటెండర్ తీసుకుని నేను సారుకు ఇస్తానని చెప్పి ఎల్లగొట్టిండు. కానీ, తెలంగాణ ఏర్పాటైనంక కేసీఆర్ సారు జెయ్యవట్టి జిల్లా అయ్యింది. కలెక్టరే మా దగ్గరకు వచ్చిండు. వారానికోసారి మా ఊరికొస్తుండు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటుండు. ముఖ్యమంత్రి అంటే గిట్లుండాలే. ప్రజల వద్దకే అధికారులను పంపుతుండు.
– బీ మద్దెల భూమయ్య, ఆర్అండ్ఆర్ కాలనీ (అనుపురం)
నంబర్ వన్ స్థానంలో నిలిచింది
మొదటి నుంచే జగిత్యాల జిల్లా చేసేందుకు అన్ని అర్హతలున్నాయి. అందుకే ప్రభుత్వానికి వినతులు ఇవ్వకున్నా కేసీఆర్ జిల్లాగా మార్చారు. ఈ ఏడేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలోనే గొప్ప నగరంగా మారే అవకాశాలున్నాయి. వ్యవసాయ రంగంతోపాటు వ్యాపార, వాణిజ్య రంగాల్లో మంచి అభివృద్ధి జరిగింది. కరీంనగర్ కంటే జగిత్యాల మరింత ముందుకు వెళ్లే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
– పెద్ది శ్రీనివాస్, జగిత్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి
అంబేద్కర్ స్ఫూర్తితోనే చిన్న జిల్లాలు
ఉమ్మడి కరీంనగర్లో నాలుగు, వరంగల్‌లో ఐదు జిల్లాలు ఏర్పాటు చేయడం అందుకు నిదర్శనం. ఎక్కడో భూపాలపల్లిలో ఉన్న టీచర్ వరంగల్ వెళ్లాలంటే.. ఎక్కడో మహాముత్తారంలో ఉన్న ఉద్యోగి కరీంనగర్ రావాలన్నా ఎంతో కష్టంగా ఉండేది. ఒక ఉద్యోగులే కాకుండా ఒక నిరుద్యోగి రావాలన్నా, రైతులు రావాలన్నా ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి సామాన్యులు తమ కష్టసుఖాలు చెప్పుకోవాలంటే ఎంతో భారమైన పనిగా ఉండేది. కేసీఆర్ చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఆ దూరభారం, శ్రమ పూర్తిగా తప్పింది. జిల్లా స్థాయిలో సులభమైన పరిపాలన వచ్చేసింది.
ప్రజలకు మరింత చేరువైంది. ఇంతకుముందు ఉమ్మడి జిల్లాలో 67 మండలాలు పర్యవేక్షించాల్సిన కలెక్టర్ స్థాయి అధికారి ఇప్పుడు 16 మండలాలకే పరిమితమయ్యారు. అంటే ప్రతి శాఖపైనా జిల్లా ఉన్నతాధికారికి క్షుణ్ణంగా పర్యవేక్షించే అవకాశం దక్కింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఎవరైనా ఉద్యోగులు తప్పులు చేసినప్పుడు ఆయా శాఖల్లో పని భారం కారణంగా చర్యలు తీసుకునేందుకు చాలా ఆలస్యమయ్యేది. ఇప్పుడు అలాకాకుండా పని భారం తగ్గడంతో చర్యలు త్వరగా తీసుకునే అవకాశం కలెక్టర్ లాంటి ఉన్నతాధికారికి చిక్కింది. ప్రజలకు చేరువగా పరిపాలన ఉండాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలంగాణలో చిన్న జిల్లాల వికేంద్రీకరణలో స్పష్టంగా కనిపిస్తున్నది.
– మానేటి ప్రతాప్‌రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు,
టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నేను ప్రత్యక్షంగా చూస్తుండెటోన్ని
చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినంకా జనాలకు చాన మేలు జరిగింది. పెద్ద జిల్లా ఉన్నప్పుడు ఎట్లుండెనో నేను ప్రత్యక్షంగా చూసిన. ఇటు కాటారం, మహదేవపూర్, ముత్తారం, అటు మేడిపల్లి, ఇబ్రహీంపట్నం, ఎల్లారెడ్డిపేట మండలాల నుంచి కరీంనగర్ కలెక్టర్ ఆఫీసుకు పనిమీద వచ్చినోళ్లు ఎంత ఇబ్బంది పడుతుండిరో నేను చూసినా.. ఒక రోజు వచ్చినపుడు సంబంధిత అధికారి దొరకనట్లయితే మల్లో రోజు వచ్చుడు వాళ్లకు కష్టమయ్యేది. అప్పుడు ఇక్కన్నే బస్టాండ్లనో అక్కన్నో ఇక్కన్నో ఉండేటిది.
లీడర్లు అయితే హోటళ్లపొంటి, లాడ్జింగ్ల పొంటి ఉండేటిది. ఇట్లా రెండు మూడు రోజులు తిరుగుతెగానీ సార్లు దొరకకపోయేది. పేదోళ్లు కలెక్టర్ ఆఫీసు పొంటి తిర్గేతానికి మస్తు కష్టపడాల్సి వచ్చేటిది. పైసలు కారబ్, పాణం కరాబ్ అయ్యేటిది. ఇపుడు కేసీఆర్ సాబ్ చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినంక ఎక్కడోళ్లక్కన్నే సార్లను కలుస్తున్నరు. చాన ఈజీ అయిపోయింది. కరీంనగర్ జిల్లాను రెండు జిల్లాలు చేస్తరు కావచ్చు అనుకున్న. నాలుగు జిల్లాలు చేసి మంచి పనిచేసిన్రు. ఇపుడు ఇట్ల చేయడం వల్ల ప్రజలకు మంచి జరుగుతంది. పాలన మంచిగ జరుగుతంది.
– ఎండీ చోటేమియా, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి (ఆఫీస్ సబార్డినేట్)
పెరిగిన పంచాయతీలు, మండలాలు
ఉమ్మడి జిల్లాలో 1207 పంచాయతీలుండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత 185 పంచాయతీలను ఇతర జిల్లాల్లో కలిపారు. ఆ మేరకు నాలుగు జిల్లాల్లో కలిసి 1022 పంచాయతీలు మిగిలాయి. కాగా, ప్రభుత్వం కొత్తగా పంచాయతీలను పెంచింది. ఇదే సమయంలో కొన్ని పంచాయతీలను పురపాలక సంఘాల్లో విలీనం చేసింది. విలీన ప్రక్రియ తర్వాత మెత్తం ఉమ్మడి జిల్లాలో పంచాయతీల సంఖ్య 1215కు చేరింది. ఉమ్మడి జిల్లాలో 57 మండలాలుంటే.. ప్రస్తుతం ఆంఖ్య 63కు చేరింది.
ఇంద్రభవనాలు.. కండ్ల ముందే కలెక్టర్లు
చిన్న జిల్లాల ఏర్పాటుతో క్షేత్రస్థాయి అధికారుల నుంచి కలెక్టర్ల వరకు.. ప్రజలకు నిత్యం కళ్లముందే కనిపిస్తున్నారు. సమస్యలు సైతం సత్వరం పరిష్కారమవుతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి నిర్వహిస్తే ప్రతి సోమవారం దాదాపు 700కు పైగా ఫిర్యాదొలొచ్చేవి. వీటిని పరిశీలించి.. సంబంధిత విభాగాలకు పంపితే, అక్కడి నుంచి పరిష్కారం కావడమనేది సాధ్యమయ్యేది కాదు. దీంతో బాధితుడు పదే పదే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఫలితంగా బాధితులకు వేలల్లో ఖర్చయ్యేది.
కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. కలెక్టర్ల నిశిత పరిశీలన పెరగడంతో ప్రజావాణిలో అన్ని విభాగాల అధికారులను అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కువ మొత్తంలో కలెక్టర్లే నేరుగా ప్రజావాణికి హాజరవుతున్నారు. దీంతో సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతున్నాయి. దీంతోపాటు కరీంనగర్ మినహా అన్ని జిల్లాల్లోనే కలెక్టరేట్లు ఇంద్ర భవనాలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్ కలెక్టరేట్ దాదాపు పూర్తికావొచ్చింది.
కలెక్టరేట్లలోనే అన్ని కార్యాయాలు ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, సాధ్యమైనంత వరకు ప్రజలు, గ్రామ, మండల స్థాయిలోనే తమ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. దీని వల్ల కలెక్టర్ వద్దకు ఫిర్యాదులు తగ్గుతూ వస్తున్నాయి. అంతేకాదు, గ్రామానికి ఒక్కో అధికారిని ఇన్చార్జిగా నియమించి, ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తున్నారు. దీని వల్ల మధ్య దళారుల వ్యవస్థ అనేది తగ్గింది. అలాగే.. కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ప్రజల చెంతకు పాలన
ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ కార్యాలయం కరీంనగర్లో ఉండేది. ఎవరో ఒక పెద్ద మనిషిని పట్టుకుంటే తప్ప కలెక్టర్‌ను కలిసే పరిస్థితి నాటిది. పైగా అంత దూరం వెళ్లాక కలెక్టర్ ఉంటారో లేదో తెలియదు. ఒక వేళ ఉన్నా వెంటనే పని అయ్యేదికాదు. మూడు నాలుగుసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగి ఇబ్బందిపడేవాళ్లం. అధికారులను కలువాలన్నా అంతే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి చాలా మేలు చేసింది. చిన్న జిల్లాలు కావడంతో పాలన ప్రజల చెంతకు వచ్చింది. కలెక్టర్, ఉన్నతాధికారులను నేరుగా కలుస్తున్నా. సమయం, నగదు ఆదా కాగా, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రజల ముంగిట్లోకి పాలన తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– డాక్టర్ చింతోజు అకాంక్ష, దంత వైద్యురాలు (సిరిసిల్ల)
ప్రజలకు ఎంతో మేలు
కోల్‌సిటీ, అక్టోబర్ 10: సీఎం కేసీఆర్ పెద్దపల్లిని జిల్లాకేంద్రం చేయడంతో ప్రజలకు ఎంతో మేలు జరిగింది. 2016కు ముందు ఏదైనా ప్రభుత్వ అధికారిని కలవాలంటే ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్‌కు వెళ్లి రావల్సి వచ్చేది. ఇప్పుడు ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలిగింది. కలెక్టర్ నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారులంతా అందుబాటులోకి వచ్చారు. క్షేత్ర పర్యటనలు కూడా అధికారులకు సులువుగా మారింది. ఒకప్పుడు జిల్లా కలెక్టర్ గోదావరిఖనికి రావాలంటే ఎప్పుడో మూడునాలుగు నెలలకు ఒకసారి వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రజల ముంగిటకే పాలన యంత్రాంగం వచ్చిందంటే ఈ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్‌కే చెల్లుతుంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా లోక కల్యాణార్థమే.
– లలితా శ్రీ, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గోదావరిఖని
సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే జిల్లా..
సీఎం కీఆర్ఆర్ దూరదృష్టితోనే పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా ఆవిర్భవించి ఏడేండ్లు పూర్తయిన సందర్భంగా సీఎం సారుకు కృతజ్ఞతలు. ప్రజలకు శుభాకాంక్షలు, గతంలో కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు వందల కిలో మీటర్లు ప్రయాణించి కరీంనగర్ కలెక్టరేట్‌కు వెళ్తే రోజంతా పట్టేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పెద్దపల్లి జిల్లా ఏ మూల నుంచి 30 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే. నాలుగైదు గంటల్లో కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు సమస్యలు విన్నవించవచ్చు.
-ఎంఏ హమీద్, టీఎన్జీవోల సంఘం పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పెద్దపల్లి)
ప్రణాళికాబద్ధంగా వృద్ధి
జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. నూతనంగా ఏర్పాటయ్యే కాలనీల్లో లే అవుట్ల ప్రకారం ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఉంటున్నాయి. అలాగే ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణంగా ఉన్న జగిత్యాలలో మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేసి రోడ్లను వెడల్పు చేయాలి. జిల్లా కేంద్రం దగ్గర కావడంతో కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి ప్రాంతాల వ్యాపారులకు లైసెన్సులు సులభతరం అయ్యాయి.
– బద్రి నరేశ్, టాక్స్ కన్సల్టెంట్ (జగిత్యాల)
ప్రగతి పరుగులు
జిల్లాల పరిధి చిన్నది కావడంతో అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు పట్టు పెరిగింది. దీంతో ఏ పని ఎక్కడ జరుగుతుందన్న దానిపై నిశిత పరిశీలన జరుగుతున్నది. ఫలితంగా ప్రగతి పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పరుగులు పెడుతున్నాయి. చిన్న జిల్లాల వల్లే కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులను సైతం మూడేళ్లలోనే పూర్తి చేసి.. వాటి ఫలాలను కాలువలు, పంపుల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ఇవేకాదు, చెరువుల మరమ్మతులను పూర్తిస్థాయిలో చేయడం వల్ల.. ప్రస్తుతం అవి నిండుకుండలా మారాయి. ప్రతి జిల్లాలోనూ గడిచిన ఏడేళ్ల కాలంలో నూరుశాతం అదనపు సాగుపెరిగింది.
ప్రభుత్వ దవాఖానలు మెరుగుపడ్డాయి. సకల సౌకర్యాలు కల్పించడమే కాదు.. వారం పదిరోజులకోమారు కలెక్టర్లు నేరుగా సందర్శన చేయడం వల్ల ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నది. సీజనల్ వ్యాధుల సమయంలో అప్రమత్తత పెరిగింది. ఇదే కాదు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు అతి వేగంగా పూర్తి కావడానికి ప్రధాన కారణం కూడా జిల్లాలే. అన్ని విభాగాలపై కలెక్టర్ ఆధ్యక్షతన సమీక్షా సమావేశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి స్కీంపై కలెక్టర్లు పట్టు బిగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్‌ను పక్కాగా పరిశీలించడం వల్ల పనులు ముందుకు సాగుతున్నాయి. ప్రాజెక్టుల పరంగా చూస్తే శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం త్వరితగతిన పూర్తయింది.
శ్రీ రాజరాజేశ్వర జలాశయం , కాకతీయ కాలువల అధునీకరణ వంటివి తక్కువ సమయంలో పూర్తిచేశారు. నాలుగు జిల్లాల్లో 2,500కోట్లతో పంచాయతీరాజ్, రోడ్డు భవనాలశాఖ అధ్వర్యంలో చేపట్టిన రోడ్ల పనులు పూర్తికాడంతో ప్రతి పల్లెకూ రోడ్డు సౌకర్యం సమకూరింది. సంక్షేమ వసతి గృహాల్లో ప్రస్తుతం మెనూ పక్కాగా అమలవుతోంది. పలుమార్లు ఉన్నతాధికారులు వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు చేయడం వల్ల ఇది సాధ్యమవుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రభుత్వ లక్ష్యాల మేరకు స్వయం ఉపాధి పథకాలు అర్హులకు దక్కుతున్నాయి.
చిన్న జిల్లా కావడంతో సంబంధిత అధికారులు ఎక్కువగా శ్రద్ధ పెట్టి.. బ్యాంకులతో మాట్లాడి.. వాటిని గ్రౌడింగ్ చేయిస్తున్నారు. ఇవే కాదు, నేరాల నియంత్రణ పూర్తిగా అదుపులోకి వచ్చింది. కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో కమిషనర్లు, ఎస్పీలు గట్టి పట్టు బిగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా తెలిసి పోయేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కార్డన్‌సెర్చ్‌లు, కొత్త యాప్‌లు, కొత్త సాంకేతిక పరిజాన్ని వినియోగించి అక్రమార్కుల ఆటలు కట్టించడంలో పోలీసు ఉన్నతాధికారులు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. ఎన్నో కేసులను 24 గంటల్లో ఛేదించారు.
అక్కడికక్కడే పరిష్కరిస్తున్నరు
ఉమ్మడి కరీంనగర్లో కలెక్టర్, జిల్లా అధికారులను కలువాలంటే రుద్రంగి నుంచి దాదాపు 70కిలోమీటర్ల దూరం పోవాల్సివచ్చేది. తీరాపోయిన తర్వాత అధికారులు ఉండేవారు కాదు. పర్యటన అని, మీటింగ్‌లో ఉన్నామని చెప్పేవాళ్లు. పలుమార్లు తిరిగితిరిగి మానుకున్నాం. సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందిపడ్డాం. తెలంగాణ రావడం కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మా ఇబ్బందులు తీరినయ్. సిరిసిల్లను జిల్లా చేయడం వల్ల మాకెంతో సౌకర్యంగా ఉంది. సమస్యలు చెప్పుకోవడానికి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసే అవకాశం వచ్చింది. సార్లందరూ ఒకే చోట ఉంటూ అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.
– మరిపల్లి అంతయ్య, రిటైర్డ్ టీచర్ (రుద్రంగి)
సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాప్
జిల్లాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల సేవలు మెరుగుపడ్డాయి. అంతకుముందు కరీంనగర్‌కు వెళ్లాలంటే ఒక్కరోజు పట్టేది. అప్పుడు నేను మల్హర్ మండలంలో టీచర్‌గా పనిచేసేది. జిల్లా విద్యాధికారి కార్యాలయానికి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులుపడేది. కోటపల్లి మండలాల పరిధిలోని ప్రజలు ఆదిలాబాద్‌కు వెళ్లి రావాలంటే రెండు రోజులు పట్టేది. అలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో జిల్లాల వికేంద్రీకరణ చేసి పరిపాలన సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
– మేజిక్ రాజా, రిటైర్డ్ ఉపాధ్యాయుడు (గోదావరిఖని)
సామాన్యులకు చాలా ఉపయోగం
చిన్న జిల్లాల ఏర్పాటు చేసిన తర్వాత సామాన్యులకు చాలా ఉపయోగపడుతున్నాయి. కరీంనగర్ పెద్ద జిల్లాగా ఉన్నప్పుడు ఎక్కడో మారుమూలలో ఉన్న మహదేవపూర్ వాసులు పని కోసం రావాలంటే రోజంతా అష్టకష్టాలు పడేవారు. ఒకవేళ అనివార్యకారణాల వల్ల వచ్చిన పని కాకపోతే వాళ్ల బాధ వర్ణణాతీతంగా ఉండేది. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కావడంతో గంటలో వెళ్లి పని చేసుకుంటున్నారు. చిన్న జిల్లాల ఏర్పడక ముందు రాష్ట్రంలోని చాలా ప్రాంత వాసులు ఇలానే ఇబ్బందులు పడ్డారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో నిరుపేదలకు వైద్య విద్య సులభమైంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవిస్తాను. చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన చాలా మెరుగుపడింది.
– బెల్లి రాజయ్య, రిటైర్డు ప్రభుత్వ ఉపాధ్యాయుడు (హుజూరాబాద్)