కరీంనగర్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోలపై ఉక్కుపాదం మోపడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మోయలేని భారాన్ని వేస్తుండడం, ఒత్తిడి పెంచడం, చర్యలకు దిగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు నిరసన బాటపట్టారు. అందులో భాగంగా ఏఈవోల ఐ కాస పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధుల కు హాజరయ్యారు.
ప్రభుత్వం తమ విషయంలో అనుసరిస్తున్న విధానాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమపై అధిక పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకుండా డిజిట ల్ క్రాప్సర్వే విధానంతో మరింత భారాన్ని మోపుతుందని, దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ర్టాల మాదిరిగా అమలు చేసే ఆలోచన చేయాలని కోరారు.
ఒక్కో క్లస్టర్లో ఏఈవో 5 నుంచి 8 గ్రామాల పరిధిలోని 600 నుంచి 1000 ఎకరాల వరకు సర్వే చేయాల్సి ఉంటుందని, ఇది కష్టతరమైన పని ఆవేదన చెందుతున్నారు. ఈ సర్వే కోసం గ్రామ స్థాయిలో సహాయకులను నియమించాలని రాష్ట్ర వ్యవసాయ సంచాలకులను కోరినా ఇప్పటి వరకు స్పందించలేదని వాపోతున్నారు. పరిష్కార మార్గం చూపకుండా డీసీఎస్ సర్వే కోసం తమపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు.