banned plastic | కోరుట్ల సెప్టెంబర్ 15: నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. పట్టణంలోని పలు కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లు, బేకరీ షాపుల్లో, మున్సిపల్ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న దుకాణదారులు, హోటల్ యజమానులకు రూ.3వేల జరిమానా విధించారు. బట్ట, పేపర్, జనపనార సంచులు ఉపయోగించాలని అవగాహన కల్పించారు.
ప్రతీ దుకాణదారుడు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిచో షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. హోటల్లో కస్టమర్లకు నాణ్యత కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. దుకాణాల నుంచి వెలువడిన చెత్తను తడి, పొడి, హానికారక చెత్తగా వేరు చేసి షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్సెక్టర్లు రాజేంద్రప్రసాద్, అశోక్, రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, హేమంత్, వార్డ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.