Private hospitals | కోల్ సిటీ , మే 2: గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు దవాఖానలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తున్నారని ఫిర్యాదు మేరకు డీఎంహెచ్ తనిఖీలకు వస్తే అదిరించి బెదిరించిన ప్రైవేటు వైద్యులు, మాజీ కార్పొరేటర్ కు అండగా ఉంటానని స్థానిక ప్రజాప్రతినిధి చెప్పడమే గాకుండా సదరు ప్రైవేటు వైద్యులతో కలిసి మీడియా సమావేశం పెట్టడంలో అంతర్యం ఏమిటని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, ఎన్.ఐ.పీ జాతీయ ఉపాధ్యక్షులు అశోక్ వేముల ప్రశ్నించారు.
గోదావరిఖనిలో వేర్వేరుగా వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని, ఆస్పత్రులకు అనుబంధంగా మెడికల్ షాపులను వైద్యులే ఏర్పాటు చేసి కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో అనుమతి లేకుండా లింగ నిర్ధారణ చేస్తున్నారన్న సమాచారంతో దళిత జిల్లా వైద్యాధికారిణి కలెక్టర్ ఆదేశాలతో తనిఖీ చేసి తహసీల్దార్ సమక్షంలో స్కానింగ్ యంత్రంను సీజ్ చేయగా, ఆస్పత్రి వైద్యులు, మాజీ ప్రజాప్రతినిధులు చేరుకొని డీఎంహెచ్ ను బెదిరించిన సంఘటన విచారకరమని, సదరు వ్యక్తులకు స్థానిక ఎమ్మెల్యే అండగా ఉంటానని మీడియా సాక్షిగా ప్రకటించడం, పైగా జర్నలిస్టులను అవమానించడం, మరోసారి ప్రైవేటు ఆస్పత్రులలో తనిఖీలకు వస్తే సహించమని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
ప్రజలకు, ప్రభుత్వం పక్షాన ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఆర్థిక దోపిడీకి పాల్పడేవారికి అండగా ఉంటామని అనడం ఏమిటని పేర్కొన్నారు. డీఎంహెచ్ఐను బెదిరించిన వారికి, ఇతర బడా వ్యాపారులకు మద్దతు పలకడం శోచనీయమన్నారు. స్థానికంగా ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన ప్రైవేటు హాస్పిటల్ కు కూడా అనుమతి లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ ప్రజా ప్రతినిధి అవినీతిపరులకు అండగా ఉంటే ధైర్యంగా తనిఖీలు చేసే చర్యలు తీసుకునే అధికారులకు ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు అండగా ఉంటారని స్పష్టం చేశారు.