రాంనగర్ ఫిబ్రవరి 11: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను(MLA Medipalli Sathyam) బెదిరించి 20 లక్షల రూపాయల డిమాండ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేనట్లు కరీంనగర్ రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యేకు గత సెప్టెంబర్ 28న గుర్తు తెలియని నెంబర్ +447886696497 నుంచి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. అందులో నిందితుడు మాట్లాడుతూ తనకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేదంటే నిన్ను అప్రతిష్టపాలు చేసి నీ ఇద్దరు పిల్లలను అనాథలు అయ్యేలా చేస్తానని బెదిరించినట్లు బాధితుడు మేడిపల్లి సత్యం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవానినగర్కి చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) గా గుర్తించారు. అతను ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడని, అక్కడి నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడని తేలింది. నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు. నిందితుడు ఈ నెల 9వ తేదీ కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయానికి రాగానే గమనించిన కర్ణాటక ఇమ్మిగ్రేషన్ అథారిటీ అఫ్ బెంగళూర్ అధికారులు అఖిలేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు సమాచారమిచ్చారు. నిందితుడిని జిల్లా పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.