Accident | సిరిసిల్ల టౌన్, నవంబర్ 20: సిరిసిల్ల జిల్లాలోని ఆటో కార్మికులదంరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంపై ఆటో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద మనసుతో కార్మికుల సంక్షేమం కోసం ఆలోచన చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కృతజ్ణతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్థాలో గురువారం ప్రమాద బీమా కల్పిస్తామన్న కేటీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొల్లి రామ్మోహన్ మాట్లాడుతూ ప్రమాద బీమా ఆటో కార్మికుల కుటుంబాలకు ధీమాను కల్పిస్తుందని కొనియాడారు. ఇటీవల సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సందర్భంలో కేటీఆర్‌ను కలిసిన ఆటో కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
దాదాపుగా జిల్లాలోని 5వేల మంది ఆటో కార్మికులకు బీమా చెల్లిస్తానని భరోసానిచ్చారన్నారు. కొద్దిరోజుల్లోనూ కార్మికులందరికీ బీమా కార్డులు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతీ ఆటో కార్మికుడికి రూ.12వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
కనీసం తినేందుకు తిండిలేని పరిస్థితిలో ఉన్నారని వాపోయారు. బీఆర్ఎస్ ఆటో కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నదని పేర్కొన్నారు. 161 మంది ఆటో కార్మికుల మరణాలపై కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్రేషియా చెల్లించాలన్నారు. ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ కార్మికుడికి నెలకు రూ.15వేలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్, ఎండీ సలీం, సతీష్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.