ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దానికి సృజనాత్మక తోడైతే సత్ఫలితాలు వస్తాయి. కానీ ఎంతోమంది తమను ప్రోత్సహించే వారు లేక మరుగునపడుతున్నారు. వారి ఆవిష్కరణలు ప్రాథమిక దశలోనే కనుమరుగవుతున్నాయి. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటా ఇన్నోవేటర్ పేరిట వివిధ దశల్లో విద్యనభ్యసిస్తున్న వారే కాకుండా నిరక్షరాస్యులు, రైతులు, వివిధ కుల వృత్తుల వారు, ఇలా.. ఎవరైనా తమ మెదడులో మెదిలిన ఆలోచనకు సృజనాత్మక జోడించి కొత్త ఆవిష్కరణకు రూపకల్పన చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం ఆగస్టు 5 వరకు పూర్తి వివరాలతో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే స్టాళ్లలో ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నారు.
తెలంగాణ చౌక్ (రాజన్న సిరిసిల్ల), జూలై 5 : సామాజిక అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి ప్రయోగ రూపకల్పన ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతుంది ఇంటింటా ఇన్నోవేటర్. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజనాత్మకత దాగి ఉంటుంది. విద్యార్థులు వారి ఆవిష్కరణలను ప్రదర్శించడానికి పాఠశాలలు, కళాశాలలు వేదికలుగా నిలుస్తాయి. కానీ సామన్య ప్రజలు కొత్త ఆలోచనల ద్వారా ప్రాజెక్టుల రూపకల్పన, సృజనాత్మకత వెలికితీసేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరువతో రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. 2019 నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంటింటా ఇన్నోవేటర్ పేరిట రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసి ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. అందులో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉన్నట్లు డీఎస్వో దేవయ్య తెలిపారు.
అందరికీ అరుదైన అవకాశం
ప్రతి వ్యక్తిలోని ఆలోచనలు, ప్రతిభను వెలికితీసి స్థానిక సమస్యకు వాటితో పరిష్కారం కనుగొనేలా ప్రోత్సహించనున్నారు. అందులో భాగం గా గృహిణి నుంచి మొదలుకొని విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యవసాయం చేసే రైతు, ఇతర వృత్తుల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఎవరైనా పాల్గొనే అవకాశమున్నది. ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసి న ఐదు ఎగ్జిబిట్లను ప్రదర్శనలో ఉంచుతారు. అందులో ప్రతిభ కనబరిచిన వారికి తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ద్వారా ప్రత్యేక గుర్తింపు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్, జ్ఞాపిక, ఇన్నోవేషన్ పేటెంట్ హక్కులు, ప్రశంసా ప్రతాన్ని అందజేస్తారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాల నుంచి ఒక ఆవిష్కరణ తప్పనిసరిగా పంపించేందుకు హెచ్ఎంలు ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుంది.
సమస్యలకు పరిష్కారం చూపేలా..
మన నిత్య జీవితంలో చుట్టూ అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. మన మెదడుకు పనిపెడితే సులువుగా, వేగవంతంగా ఆ సమస్యలను పరిష్కరించవచ్చు. ఒక ఉత్పత్తి, ఒక ప్రక్రియ, సమస్యకు నూతన పరిష్కరం చూపడానికి సృజనాత్మకమైన ఆలోచనే ఆవిష్కరణకు ఇతివృత్తం అవుతుంది. ఏదైనా కొత్త విషయం తెలుసకోడానికి సమగ్ర అవగాహన ఉంటే అది ఆవిష్కరణకు దారి తీస్తుంది. విభిన్న వస్తువును తయారు చేసేలా ప్రేరేపిస్తుంది. అలా తయారు చేసిన పరికరం సమస్య పరిష్కారానికి మార్గం చూపేలా ఉంటే ఆవిష్కరణగా గుర్తింపు పొందుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య పరిష్కారానికి మార్గం చూపేలా ఉండేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దరఖాస్తు చేయండిలా..
తమ ఆలోచనలకు అనుగుణంగా తయారు చేసిన ప్రాజెక్టు విషయాలను దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది. వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు రూపొందించే ముందు దానికి సంబంధించి ఆరు వ్యాక్యాలతో కూడిన ఆవిష్కరణ వివరణ, రెండు నిమిషాలు నిడివి కలిగిన వీడియో, ఆవిష్కరణకు సంబంధించి నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, వయస్సు, మొబైల్ నంబర్, ప్రస్తుత వృత్తి, పూర్తి వివరాలు, అడ్రస్‌ను క్రోడీకరించి 94924 5877 5 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. వచ్చిన ఆవిష్కరణల నుంచి ఉత్తమ ప్రతిభ చూపిన వాటిని ఐదు ఎంపిక చేసి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే స్టాల్స్‌లో ప్రదర్శనకు అవకాశం కల్పిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
అన్ని వర్గాల ప్రజలు నిత్య జీవితంలో ఉపయోగపడే ఆవిష్కరణల కోసం ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ వేదికను ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తున్నది. ప్రతి పాఠశాల నుంచి నూతన ఆవిష్కరణలు ఉండేలా హెచ్ఎంలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. అందులో వివిధ వృత్తుల వారు, విద్యార్థులు, ఆయా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న వారు పాల్గొనవచ్చు. తమలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేయవచ్చు.
– పాముల దేవయ్య, జిల్లా సైన్స్ అధికారి (రాజన్న సిరిసిల్ల)