గతంలో భూమి మ్యుటేషన్ కోసం ఆ తహసీల్దార్‌కు అడిగినంత ముట్టజెప్పాడు. అయినా పని కాకపోవడంతో కలెక్టరేట్‌కు ప్రజావాణిలో వెళ్లి దరఖాస్తు ఇవ్వడంతో మ్యుటేషన్ పూర్తయి, పట్టా పాస్‌బుక్ వచ్చింది. తాజాగా, పహాణీ నకల్ అవసరమైనరైతు మళ్లీ సదరు తహసీల్దార్‌ను సంప్రదిస్తే 10 వేలు ఇస్తేనే పనవుతుందని చెప్పడంతో చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో సదరు రైతు వద్ద 10 వేలు లంచం తీసుకుంటుండగా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్‌తో పాటు ఆయన డ్రైవర్, ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 3 : కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల మండలంలోని కొమిరెకు చెందిన కాడం తిరుపతి, ఆయన తండ్రి మల్ల య్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉంటున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిల్ల గ్రామ శివారులోని సర్వేనెంబర్ 645లో 28 గుంటల వ్యవసాయ భూమి ఉంది.
దీనికి సంబంధించిన మ్యుటేషన్ పెం డింగ్‌లో ఉండగా, పట్టాదార్ పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ జాహెద్పాషాను తిరుపతి పలుసార్లు కలిశాడు. దీని కోసం ముందుగా 50 వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ డిమాండ్ చేయడంతో మూడు విడుతల్లో (15 వేలు, 20 వేలు, 15 వేలు) లంచం ముట్టచెప్పాడు. అయినా పని పూర్తి చేయకపోవడంతో పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో తిరుపతి, ఆయన తండ్రి మల్లయ్య రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు గత నెల 23న భూమిని ధరణిలో నమోదు చేసి ఆన్లైన్ చేయగా, పట్టా పాస్ పుస్తకం వచ్చింది. అయితే, బ్యాంక్ లోన్ కోసం లింక్ డాక్యుమెంట్ (పహాణీ నకల్) అవసరం కావడంతో తహసీల్దార్‌ను తిరుపతి సంప్రదించాడు. 10 వేలు లంచం ఇస్తేనే పని చేస్తానని తహసీల్దార్ చెప్పడంతో విసుగు చెందిన రైతు తిరుపతి రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధిత రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ప్రణాళిక వేశారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ జాహెద్‌పాషా, చిన్నరాత్‌పల్లి వీఆర్ఏ దాసరి మల్లేశం కొడుకు దాసరి ధర్మేందర్(విష్టు), డ్రైవర్ అమ్జద్‌పాషా రైతు కాడెం తిరుపతి నుంచి 10 వేలు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.
లంచం కావాలని వేధించిండు
నాకు కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పంది ల్ల శివారులో 28 గుంటల వ్యవసాయ భూ మి ఉంది. ఆ భూమి మ్యుటేషన్ కోసం తహసీల్దార్‌కు గతంలో 50వేలు లంచం ఇచ్చినా పని చేయలేదు. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆన్లైన్ అయింది. పట్టా పాస్ పుస్తకం వచ్చింది.
బ్యాంక్ లోన్ కోసం పహాణీ నకల్ కావాలని తహసీల్దార్‌ను సంప్రదిస్తే మళ్లీ 10వేలు లం చం డిమాండ్ చేసిండు. ఆయన డ్రైవర్ అమ్జద్‌పాషా, తహసీల్దార్ ఆఫీసులో పనిచేసే దా సరి ధర్మేందర్(విష్ణు)కు 10 వేలు ఇవ్వాలని చెప్పిండు. అంత డబ్బు తనవద్ద లేదని, ఎంత చెప్పినా వినిపించుకోలేదు. డబ్బులు కావాలని వేధించాడు. ఆ బాధ భరించలేక రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను కలిశా. అవినీతి తహసీల్దార్‌ను ఏసీబీకి పట్టించా.
– తిరుపతి, రైతు