పెద్దపల్లి, జూన్ 26(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రోడ్డు రవాణా సంస్థ అధికారి(ఆర్టీవో) కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వినియోగదారుల నుంచి ఆర్టీవో అధికారులు డబ్బులు గుంజుతున్నారని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో దాడులు చేశారు.
తనిఖీల అనంతరం ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయాన్ని తనిఖీ చేశామని చెప్పారు. కార్యాలయం రికార్డులో లేని 60,450 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెద్దపల్లి ఆర్టీవో రంగారావు, ఎంవీఐలు శివ స్వప్న, మక్సుద్, ఏఎంవీఐ మధుతోపాటు 12 మంది సిబ్బంది, ఆరుగురు ఏజెంట్లు, ఇద్దరు డ్రైవర్లను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తనిఖీలో ఏసీబీ డీఎస్పీతో పాటు అధికారులు పాల్గొన్నారు.