ABVP | హుజురాబాద్, ఆగస్టు 29 : ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని హుజురాబాద్ లోని ఓ వినాయక విగ్రహానికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అజ్ఞానం తొలగించి, తగిన బుద్ధి ప్రసాదించి విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలషిప్లను విడుదల చేసేలాగా దీవించాలని వినాయకుడిని వేడుకున్నారు.
ప్రభుత్వాలు మారిన విద్యార్థుల గోసలు మారడం లేదని, ఆరు పథకాల పేరిట రాష్ట్రాన్ని ఆగం చేసిండు ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయకుండా కాలక్షేపం గడుపుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విద్యార్థులకు రావాల్సిన ఫీజులను రూ.8300 కోట్లను పెండింగ్ లో పెట్టిందన్నారు. తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విదార్థుల దగ్గరి నుండి వసూలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
హాస్టల్లో కనీసం మౌలిక వసతులు లేకుండా విద్యార్థులు అనారోగ్యానికి గురై చనిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ లో వసతులు సరిగా లేని కారణంగా అద్దె భవనంలో విద్యార్థులు ఇరుకిరుకు గదుల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతుని ధ్వజమెత్తారు. మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచకపోవడంతో నాణ్యమైన భోజనం అందడం లేదని, దీనికి ప్రభుత్వ వైఫల్యం మే కారణమని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో టీచింగ్-నాన్ టీచింగ్ సిబ్బంది లేని కారణంగా విద్యార్థులు దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనితోపాటు గురుకులాల్లో నిత్య కృత్యంగా మారిన ఫుడ్ పాయిజన్ లను అరికట్టలేక పోయిందని, అధికారులు, మంత్రులు పేపర్ల ప్రకటనలకే తప్ప సమస్య పరిష్కారం జరిగిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. మత్తు, మాదక ద్రవ్యలు, గంజాయి విచ్ఛల విడిగా పాఠశాలలో కళాశాలల కేంద్రంగా పెరిగిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. విద్యార్థులను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
అదేవిధంగా సకాలంలో ఫీజులు అందని కారణంగా కొన్ని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ కళాశాలలో మూసి వేయడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే మొండి బకాయలను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. విద్యను పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్న యాజమాన్యాలపై చట్టరిత్యా చర్యలు తీసుకొని గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కొయ్యల అంజి, నగర సంయుక్త కార్యదర్శి శ్రీశాంత్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.