పెద్దపల్లి, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఇప్పటికే పూర్తయిన కుష్టు(ఎల్సీడీసీ) సర్వేకు సంబంధించిన ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేకుంటే మరో సర్వే చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ కార్యకర్తలు స్థానిక కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో ప్రసన్నకుమారి అక్కడికి చేరుకుని సమస్యలు తెలుసుకున్నారు. గత మూడేళ్లుగా ఎల్సీడీసీ సర్వేలు చేస్తున్నామని, సర్వేకు సంబంధించి మెయిల్ వర్కర్ కూడా ఉండాలని చెప్తే వారిని సైతం నియమించుకొని సర్వేలు చేశామని, వారికి తామే డబ్బులు చెల్లించామని, చాలీ చాలని జీతాలతో జీవితాలను ఒడ్డెక్కిస్తున్నామని వాపోయారు.
తమకు వెంట వెంటనే సర్వే డబ్బులు చెల్లించకుండా జాప్యం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఒక సర్వే పూర్తి కాక ముందే మరో సర్వే చేయాలని ఆదేశాలు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్సీడీసీ సర్వే పూర్తి చేసిన తమకు ఇమ్యూనైజేషన్ సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయని, అది చేస్తుండగానే మళ్లీ బీసీజీ సర్వే చేయాలని పేర్కొన్నారని తెలిపారు. ఆ సర్వేలు పూర్తి కాక ముందే తాజాగా, సోమవారం నుంచి ఎల్సీడీసీ సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. ఇలా ఏక కాలంలో అనేక సర్వేలు చేయడం ఎవరితోనైనా సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా తాము పాటిస్తామని, కానీ ఇప్పటికే బకాయిలు ఉన్న ఎల్సీడీసీ సర్వేకు సంబంధించిన డబ్బులను వెంటనే చెల్లించాలని, అప్పటి వరకూ ఏ సర్వేలు చేయమని డీఎంహెచ్‌వోకు తేల్చి చెప్పారు.