సిరిసిల్ల టౌన్, మే 28 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రభు త్వం కేటాయించిన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో ఎందుకు పెట్టాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రశ్నించారు. డబ్బు సంచులతో దొరికిన దొంగ ఫొటోను ఎలా పెడతారన్న ఆయన, ప్రజలు తమ ఇంటి ముందు దిష్టిబొమ్మలా పెట్టుకుంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రొటోకాల్ గురించి ఆది శ్రీనివాస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాలలో ప్రొటోకాల్ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో సీఎస్‌కు ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్‌ను ఎందుకు ఆహ్వానించలేదని, ప్రొటోకాల్ ప్రకారం కేటీఆర్ ఫొటో లేకపోవడంపై ఎందుకు మీరెందుకు ప్రశ్నించలేదో చెప్పాలని ప్రశ్నించారు.
కేటీఆర్ చొరవతో నిర్మితమైన అభివృద్ధి కార్యక్రమాలను మీరే చేసినట్లు ప్రొసీడింగ్‌లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన క్యాంపు కార్యాలయం లో రేవంత్ ఫొటో పెట్టాలంటున్నారు కదా, మరి రాహుల్, ప్రియాంక క్యాంపు కార్యాలయాల్లో మోదీ ఫొటోలు ఎక్కడ పెట్టారో చూపించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యహరిస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రొటోకాల్ అమలు చేయని అధికారులపై రాబోయే రోజుల్లో చర్యలు తప్పవన్నారు. క్యాంపు కార్యాలయాలు కేసీఆర్ సొంత డబ్బులతో కట్టలేదని అంటున్న మీరు, రేవంత్‌రెడ్డి ఏమైనా తన సొంత ఇంటి డబ్బులతో కట్టాడా..? అని ప్రశ్నించారు. కూ ల్చివేతలు తప్ప అభివృద్ధి తెలియన వ్యక్తి రే వంత్ అని, క్యాంప్ ఆఫీసుల్లో మహాత్ముల చిత్రం పెట్టుకోమంటే అర్థం ఉంటుందని, యాభై లక్షలతో దొరికిన దొంగ ఫొటో ఏ విధంగా పెట్టుకోమంటారని నిలదీశారు. వేములవాడలో అనేక సార్లు ప్రజల చీత్కారంతో ఓడిపోయిన ఆది శ్రీనివాస్, ‘అయ్యో పాపం శీనన్న’ అంటే గెలిచారనే విషయాన్ని మరిచిపోవద్దని హితవుపలికారు. సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిలో గోరంత శాతం కూడా సాధించబోవని చురకలంటించారు.
రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. రాక్షస పా లన సాగుతుందని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి విమర్శించారు. కక్షసాధింపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ ఫొటోతో వచ్చి కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద గుండాయిజం ప్రదర్శించారని, కాంగ్రెస్ నేత భీమవరం శ్రీనివాస్ తనపై చేసిన విమర్శలు విచిత్రంగా ఉన్నాయన్నారు. తాను అనేక సార్లు వివిధ హోదాల్లో పని చేసినప్పటికీ ఎక్కడా ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్నారు. భవిష్యత్‌లో ఆరోపణలుచేసే ముందు పునరాలోచన చేసుకోవాలని హితవుపలికా రు. సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దిడ్డి రాజు, వెంగళ శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, రాజిరెడ్డి, వీరగోని శ్రీనివాస్‌గౌడ్ నాయకులు ఉన్నారు.