RAJEEV YUVA VIKASAM | గంగాధర, ఏప్రిల్ 12: రాజీవ్ యువ వికాసం లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన ఓ యువకుడికి వింత పరిస్థితి ఎదురైంది. గంగాధర మండల కేంద్రానికి చెందిన గంగాధర మోహన్ అనే యువకుడు రెండు రోజుల క్రితం రాజీవ్ యువ వికాసం లో భాగంగా సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ సెంటర్ కు వెళ్లాడు.
సెంటర్ నిర్వాహకుడు ఆన్లైన్లో మోహన్ కు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ 3764 9217 4385 నెంబర్ను కొట్టగానే తన వివరాలు కాకుండా కురిక్యాల గ్రామానికి చెందిన శ్రావణి అనే మహిళకు సంబంధించిన వివరాలు వచ్చాయి. దీంతో యువకుడు విస్మయానికి గురయ్యాడు. తన ఆధార్ కార్డు నంబర్ తో వేరొక మహిళ వివరాలు ఎలా వచ్చాయో తెలియడం లేదని మోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పై విషయం గురించి కరీంనగర్ బీసీ కార్పొరేషన్ కార్యాలయం, గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు మోహన్ తెలిపాడు.
తప్పిదం ఎక్కడ జరిగిందో అధికారులు తెలపడం లేదని మోహన్ వాపోయాడు. ఈనెల 14న సబ్సిడీ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడంతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని మోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు.