Godavarikhani | కోల్ సిటీ, జూన్ 9 : బెంగుళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శంచడానికి గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం కిరణ్-శ్వేత దంపతుల కుమారుడు రిశ్విక్ కు ఆహ్వానం లభించింది. అంతర్జాతీయ సంస్థ ఇస్కాన్ గత ఫిబ్రవరి 3న ఆన్లైన్లో నిర్వహించిన ప్రపంచ స్థాయి భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ లో రిశ్విక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, 95 శాతం కంటే అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జూమ్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేశారు.
ఈ క్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ప్రేమ్ రాజ్ చైతన్య రిశ్విక్ కు బహుమతిగా సైకిల్ తోపాటు ప్రశంసా పత్రంను అందజేశారు. ఈనెల 12న బెంగుళూరులోని ఇస్రోను సందర్శించడానికి, నేషనల్ టాపర్స్ అవార్డు సెరిమనీలో పాల్గొనడానికి ఆహ్వానం పంపించారు. ఇస్రో చైర్మన్, ఏరో నాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ సోమనాథ్ ను కలిసే అవకాశంతోపాటు ఆయనతోపాటు గ్రూప్ ఫొటో, డమ్మీ రాకెట్ లాంచింగ్ డెమోను తిలకించడానికి తల్లిదండ్రులతో కలిసి రిశ్విక్ బెంగుళూరు బయలుదేరి వెళ్లాడు. కాగా, గోదావరిఖని కృష్ణవేణి పాఠశాలలో రిశ్విక్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.