Road Accident | చిగురుమామిడి, జూన్ 22 : బతుకు దెరువులో భాగంగా వరి నాట్ల కోసం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కొంత మంది కూలీలు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. కానీ కూలీ దొరక్కపోవడంతో.. తిరిగి తమ సొంతూరుకు వెళ్లేందుకు కరీంనగర్‌కు రెండు ఆటోల్లో బయల్దేరగా, ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని ఓటగుండం గ్రామానికి చెందిన 18 మంది కూలీలు మూడు రోజుల క్రితం చిగురుమామిడికి వరి నాట్ల ఉపాధి కోసం వచ్చారు. ఇంకా పనులు ప్రారంభం కాకపోవడంతో తిరిగి స్వస్థలమైన కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు కరీంనగర్‌కు రెండు ఆటోలలో చిగురుమామిడి నుండి ఆటోలో బయలుదేరారు. ఒక ఆటోలో తొమ్మిది మంది ఉండగా.. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు కారు అతివేగంతో దూసుకెళ్తుండగా.. దాన్నుంచి తప్పించుకునేందుకు యత్నించగా, ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగంలో కూర్చున్న కందుల సురేశ్(43) తలకు తీవ్ర గాయమైంది. 108 అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అదే ఆటోలో ఉన్న దావనబోయిన శ్రీరాములు, దావనబోయిన నాంచారమ్మ, దావనబోయిన కృష్ణకుమారి, మాగంటి కుమారీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి వెనుక ఆటోలో వస్తున్న మృతుడు సురేష్ భార్య వనజాక్షి కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. మృతుడు సురేష్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.