పెగడపల్లి , డిసెంబర్ 18: కట్టుకున్న భార్యను పొలంలోనే హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. మూడేండ్ల క్రితం కొడుకును హతమార్చిన దుర్మార్గుడు భార్య పొలంలో నాటు వేస్తుండగా కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంటలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమలకుంటకు చెందిన నక్క రమేశ్‌తో గంగవ్వ(45)కు సుమారు ఇరువై ఐదు ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు జలంధర్, బిడ్డ స్నేహ ఉన్నారు. రమేశ్ పనిపాటలేకుండా జులాయిగా తిరిగేవాడు.
ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేది. మూడేండ్ల క్రితం ఇరువురు గొడవ పడుతుండగా అడ్డువచ్చిన కొడుకు జలంధర్‌ను కొట్టి చంపాడు. కొడుకు హత్య కేసులో జైలుకు వెళ్లివచ్చిన రమేశ్ గ్రామంలోనే భార్య గంగవ్వకు దూరంగా ఉంటున్నాడు. వీరికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా గంగవ్వే సాగు చేస్తున్నది. అయితే ఈ భూమి తనకు కావాలని రమేశ్ కొంతకాలంగా భార్య గంగవ్వను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గంగవ్వ తన పొలంలో కూతురు స్నేహ, మరికొంతమంది కూలీలతో కలి సి నాటు వేస్తున్నది. ఈ సమయంలో రమేశ్ తన తండ్రితో కలిసి అక్కడికి చేరుకున్నాడు.
తండ్రి సూచన మేరకు భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డువచ్చిన కూతురు స్నేహపై దాడి చేయగా ఆమె మంగళసూత్రం తెగిపోయింది. భయభ్రాంతులకు గురైన తోటి కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించగా వారు పోలీసులకు తెలియజేశారు. వారందించిన సమాచా రంతో హుటాహుటీనా మల్యాల సీఐ రమణమూర్తి, పెగడపల్లి ఎస్ఐ శ్వేత ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. కూతురు స్నేహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు.