Rachapalli | ధర్మారం, జూలై 12 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలోకి శ్వేత నాగు ప్రవేశించింది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించగా భక్తులు దీనిని పునరుద్ధరించి గత దశాబ్ధాలుగా శివుడికి నిత్య పూజలు చేస్తున్నారు. ఇక్కడ ప్రతీ ఏటా శివరాత్రి సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేములవాడ తరహాలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉంది. ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి.
ఈ ఆలయంను ఆనుకొని పక్కనే నాగదేవత గుడి ఉండగా ఇప్పటికీ అందులో పుట్ట ఉంది. ఈ క్రమంలో ఆలయ పూజారి మామిడిపల్లి శ్రీనివాస చారి రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం ఆలయ గర్భగుడి తలుపు తీయగానే శివలింగం పక్కన శ్వేతనాగు ప్రత్యక్షమైంది. దీంతో చుట్టుపక్కల వారికి ఆయన ఈ విషయాన్ని తెలియడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి తరలివచ్చి శ్వేత నాగును చూస్తున్నారు. శివుడి మహిమ వల్లే ఆలయంలోకి శ్వేత నాగుపాము ప్రవేశించి ఉంటుందని గ్రామస్తులు భావిస్తూ ఓం నమశివాయః అంటూ శివనామస్మరణ చేస్తున్నారు. శ్వేత నాగును బయటికి పంపకుండా అది స్వయాన గర్భగుడి నుంచి బయటికి వెళ్లే దాకా చూస్తామని గ్రామస్తులు అంటున్నారు. మొత్తం మీద ఎన్నడూ లేని విధంగా ఆలయ గర్భగుడిలోకి శ్వేత నాగు ప్రవేశించడంతో గ్రామంలో సర్వత్ర చర్చ సాగుతోంది.