Train Gate | గంగాధర, మార్చి 20 : గంగాధర మండలం మంగపేట గ్రామ శివారులో జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారిపై రైల్వే గేటు పడడంతో పేషంటుతో కరీంనగర్ ఆసుపత్రికి వెళుతున్న అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకు పోయింది. జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిపై ప్రతీరోజు వేలాది వాహనాలు వెళుతుంటాయి. రైళ్లు వస్తున్న సమయంలో మంగపేట శివారులో జాతీయ రహదారిపై ఉన్న రైల్వే గేటు పడడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
శుక్రవారం రైల్వే గేట్ పడిన సందర్భంగా పేషెంట్ తో కరీంనగర్ ఆసుపత్రికి వెళుతున్న ఓ అంబులెన్స్ గేట్ వద్ద నిలిచిపోయింది. ఆపద సమయంలో వెళుతున్న అంబులెన్స్ నిలిచిపోవడంతో ప్రాణాపాయం సంభవిస్తే ఎవరు అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఏండ్లుగా ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నా.. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రైల్వే శాఖ అధికారులు కానీ స్పందించడం లేదని పలువురు మండిపడుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేలా చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.