హెలీకాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ అనిల్‌కు అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. ‘వీరుడా నీకు వందనం.. అమరుడా నీకు వందనం’ అంటూ నినదిస్తూ హోరెత్తించింది. అంతకుముందు ఆర్మీ అధికారులు అనిల్ భౌతిక కాయాన్ని ఆర్మీ వాహనంలో తీసుకురాగా, గంగాధర ఎక్స్‌రోడ్ నుంచి స్వగ్రామం మల్కాపూర్ దాకా భారీ ర్యాలీ తీశారు. ఆర్మీ అధికారులు భౌతికకాయాన్ని మోసుకొచ్చి ఇంటి ముందు వేదికపై ఉంచగా, భార్య సౌజన్య, తల్లిదండ్రులు లక్ష్మి, మల్లయ్య గుండెలవిసేలా రోదించారు. అనంతరం అశేష జనవాహిని మధ్య ఇంటి నుంచి అంతిమ యాత్రగా వెళ్లి, పొలం వద్ద సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అధికారులు నివాళులర్పించారు.
– బోయినపల్లి, మే 6
బోయినపల్లి, మే 6: హెలీకాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందిన పబ్బల్ల అనిల్ (29)కు గ్రామస్తులు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారు. ‘వీరుడా నీకు వందనం.. అమరుడా నీకు వందనం’ అంటూ జేజేలు కొడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన పబ్బల్ల అనిల్ పదకొండేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. సీఎఫ్ఎన్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 4న సాయంత్రం జమ్మూకశ్మీర్‌లో కిశ్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ద్రువ్ హెలీకాప్టర్ ప్రమాదంలో అమరుడయ్యాడు.
స్వగ్రామానికి భౌతికకాయం
ఆర్మీ అధికారులు ఆర్మీ వాహనంలో అనిల్ భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గంగాధర మండలం ఎక్స్‌రోడ్డు వద్దకు మధురానాగర్ వాహనం చేరుకోగానే, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఎదురెళ్లారు. అక్కడి నుంచి అశేష జనవాహిని మధ్య భారీ మోటర్ సైకిళ్ల ర్యాలీగా మల్కాపూర్‌కు చేరుకున్నారు. ఇంటికి కొద్ది దూరంలోనే ఆర్మీ జవాన్లు వాహనాన్ని ఆపి భౌతిక కాయాన్ని దింపి, భుజాలపై మోసుకొచ్చారు. అప్పటికే ఇంటి ముందు సిద్ధం చేసిన ప్రత్యేక వేదికపై భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచగా, అనిల్ భౌతికకాయంపై సతీమణి సౌజన్య, తల్లితండ్రులు లక్ష్మి, మల్లయ్య, చిన్నారులైన కుమారులు అయాన్, అరవ్ కన్నీరుమున్నీరుగా రోదించారు.
ప్రముఖుల నివాళి
అనిల్ భౌతిక కాయం వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రి గంగుల కమలాకర్, మల్కాపూర్ వచ్చి పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం పెట్టి గౌరవ వందనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్, కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఎస్పీ అఖిల్ మహజన్, ఆర్మీ మేజర్ పరష్ సమంత్తోపాటు అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు, స్థానిక నేతలు నివాళులర్పించారు.
అశేష జనవాహిని మధ్యన అంతిమయాత్ర
అనిల్ అంతిమ యాత్రలో అశేష జనం పాల్గొన్నారు. మల్కాపూర్ ఆ చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళి అర్పించారు. సందర్శన అనంతరం అనిల్ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారుల వాహనంలో ఎక్కించగా, అభిమానులు, ప్రజలు నాయకులు ఒక్కసారిగా ‘వీరుడా వందనం.. జై జవాన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అశేష జనవాహిని మధ్య అంతిమ యాత్ర చేపట్టగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. ఆర్మీ అధికారులు కవాతుగా పార్థీవదేహాన్ని అనిల్ రెండు కిలోమీటర్ల దూరంలోని పొలం వద్దకు తీసుకెళ్లారు. దారిపొడవునా జనం కనిపించారు.
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
అనిల్ భౌతిక కాయానికి ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. ముందుగా గౌరవవందనం చేశారు. పార్థీవ దేహంపై ఉన్న జాతీయ జెండాను, అనిల్ యూనిఫాంను ఆయన సతీమణి సౌజన్యకు అర్మీ అధికారి అందించారు. ఆ తర్వాత పెద్ద కొడుకు అయాన్ తండ్రి చితికి నిప్పంటించగా, ఆర్మీ అధికారులు గౌరవంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
చితికి నిప్పుపెట్టిన ఏడేళ్ల కొడుకు
ఆర్మీ జవాన్ అనిల్‌కు ఏడేళ్ల కొడుకు అయాన్‌తో అంతిమ సంస్కారాలు జరిపించారు. అంతిమయాత్ర పొడవునా ఆ బాలుడి దీన చూపులను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. పదిహేను రోజుల ముందే తమను విడిచి పోయిన తన తండ్రి ఇలా నిర్జీవంగా రావడం ఆ బాలుడికి అర్థం కాక, ఆ శవపేటిక వైపు చూసిన తీరు అందరినీ కలచివేసింది. వ్యవసాయ భూమి వద్దకు నడవ లేకపోయిన అయాన్‌ను వారి బంధువు ఒకరు ఎత్తుకొని ముందుకు సాగగా, దారిపొడవునా తన తండ్రివైపు తిరిగి చూడడం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మరో కొడుకు అరవ్(4) కూడా ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉండడం కనిపించింది. ఆ ఇద్దరు పిల్లలను చూసి బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు.
కొడుకు అంత్యక్రియలకు రాలేని స్థితిలో తండ్రి
అనిల్ తండ్రి మల్లయ్య కుడి కాలుకు దెబ్బతగిలింది. షుగర్ వ్యాధిగ్రస్తుడు కావడంతో ఇన్ఫెక్షన్ అయి కాలు కాస్త దెబ్బతిన్నది. ఇతని ఆపరేషన్ కోసమే అనిల్ స్వగ్రామానికి వచ్చాడు. శస్త్రచికిత్స ద్వారా కాలు తీయించి ఇంటి వద్ద ఉంచి, పది రోజులపాటు గ్రామంలోనే ఉన్నాడు. పదిహేను రోజుల కిందనే తిరిగి విధులకు వెళ్లాడు. అంతలోనే అనిల్ మృతి చెందడంతో ఆ తండ్రి మల్లయ్య గుండెలవిసేలా రోదించాడు. తన ఆరోగ్యం బాగు చేయించి వెళ్లిన కొడుకు ఇలా నిర్జీవంగా తిరిగి రావడం చూసి గుండెలు బాదుకున్నాడు. తనకు కాలు లేకపోవడం, ఇటీవలే శస్త్రచికిత్స జరగడంతో అంతిమయాత్రకు వెళ్లలేక ఇంటి వద్దనే ఉండి పోయాడు.
కలిచివేసిన రోదనలు
బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన తన మేన మామ పల్ల భూమయ్య కూతురు సౌజన్యతో 15 ఏళ్ల క్రితం అనిల్‌కు వివాహమైంది. వీరికి కొడుకులు. పెద్దవాడు అయాన్, చిన్న వాడు అరవ్. పదిహేను రోజుల క్రితమే వచ్చి వెళ్లిన అనిల్ ఇలా నిర్జీవంగా తిరిగి రావడంతో ఆ భార్య హృదయవిదారకంగా రోదించింది. ఇంటి వద్ద అనిల్ ఫ్లెక్సీని పట్టుకొని ‘నా బావ ఇక లేడు. ఆ భగవంతుడు నాపై కక్ష కట్టాడు’ అంటూ గుండెలు బాదుకున్నది. తన భర్తతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది. చితికి నిప్పుపెట్టే ముందు భౌతికకాయం పై ఉన్న జాతీయ జెండాను, అనిల్ యూనిఫాంను ఆర్మీ అధికారి అందించగా, వాటిని ఆమె గుండెలకు హత్తుకొని రోదించింది. అనంతరం మృతదేహన్ని చితిపై పెట్టగా, ‘నేను కూడా నా బావతో వెళ్లి పోతా’ అంటూ రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. తనను కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లమని చెప్పాడని, అంతలోనే తన భర్తను భగవంతుడు మృత్యురూపంలో తనకు దూరం చేశాడని అరగంటకు పైగా విలపించింది. అటు అనిల్ తల్లి లక్ష్మి కూడా కొడుకు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించింది. వీరిద్దరినీ ఓదార్చడం బంధువులు, గ్రామస్తుల వల్ల కాలేదు. దేశం కోసం అనిల్ చేసిన ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు,