Anganwadi | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 13 : అధికారంలోకి వచ్చే దాకా ఓటి, వచ్చినంక మరోటి అన్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఆచరణలో మాత్రం ఘోర వైఫల్యం చెందుతోందనే విమర్శలు వస్తున్నాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ సాయం అందిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్న కావస్తున్నా.. పాత విధానమే అమలు చేస్తూ మెండి ‘చేయి’ చూపడంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు.
ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు పుట్టెడు కష్టం చేస్తున్న అంగన్వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ సర్కారు వారు ఆశించినదానికి మించి గౌరవ వేతనం పెంచింది. అంగన్వాడీల టీవర్ల విజ్జప్తి మేరకు 2023 మే నెలలో టీచర్లకు రూ.లక్ష, ఆయాకు రూ.50వేలు, ఆసరా పింఛన్ మంజూరు, బీఎల్వో విధుల రద్దు, అంగన్వాడీ కేంద్రాల పనులు మినహా ఇతర ప్రభుత్వ విభాగాల పనులేవి అప్పగించబోమంటూ హామీ ఇచ్చింది. అలాగే, ప్రభుత్వ టీచర్ల మాదిరి వేసవి సెలవులు వర్తింపజేసేందుకు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ రాజకీయ క్రీడకు తెరలేపింది. అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని, కనీస వేతన చట్టం అమలు చేస్తామని ప్రకటించి ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆంగన్వాడీలపై సానుభూతి కురిపిస్తూ న్యాయం చేస్తామని నమ్మబలికింది. ఇక తమ దశ మారినట్టేనని వారు సంబురపడుతున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లింది. విరమణ తర్వాత టీచర్లకు రూ. లక్ష, ఆయాలకు రూ. 75 వేలు అందిస్తామని గతేడాది ఏప్రిల్లో జీవో నం.10 జారీ చేసింది. దీంతో, ఇచ్చిన హామీల అమలు దేవుడెరుగు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు కూడా కొనసాగించకపోవడంతో పదవీ విరమణ పొందిన అంగన్వాడీలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. రిటైర్మెంట్ అయి ఏడాది దాటినా ఇప్పటివరకు గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలు గాని, ఇటు మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు గాని పూర్తిస్థాయిలో అమలుచేయటం లేదు. ఫలితంగా పదవీ విరమణ పొందిన టీచర్లు, ఆయాలు కాల్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులేమో తమకేమి తెలియదని చేతులెత్తేస్తున్నారు.
అప్పుడు కనీస వేతన చట్టం, ఆసరా పింఛన్, గత ప్రభుత్వానికన్న అధికంగా పదవీ విరమణ సాయమంటూ నమ్మించి, ఇప్పుడు నామమాత్రపు సాయంతో చేతులు దులుపుకోవటం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే ఆందోళ నకు దిగుతామంటూ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
ఇచ్చిన మాట నిలుపుకోవాలి
– టేకుమల్ల సమ్మయ్య, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అంగన్వాడీలకు కనీస వేతన చట్టం అమలు చేస్తామని అసెంబ్లీలో మంత్రి సీతక్క ఇచ్చిన మాట నిలుపుకోవాలి. తక్షణమే జీవో నంబర్ 10 రద్దు చేయాలి. గత యేడాది ఏప్రిల్ 3న విడుదల చేసిన 1334 మెమోను కూడా ఉపసంహరించుకోవాలి. ఆసరా పింఛన్ కాదు, పింఛన్ గ్రాట్యుటీ ప్రకారం వచ్చే పింఛన్ అందించాలి. లేకుంటే, వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతాం.