హుజూరాబాద్/ వీణవంక, జూలై 17 : బీజేపీలో ఆధిపత్యపోరు బయటపడుతున్నది. తాజాగా హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి రాసిన లేఖ వర్గపోరును బహిర్గతం చేస్తున్నది. గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హుజూరాబాద్‌లో పదో తరగతి సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్నది మోదీ వర్గం మాత్రమేనని, ఈటల రాజేందర్, బండిసంజయ్ వర్గం అంటూ ఏదీ లేదని పేర్కొన్నారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో మోదీ కోసం పనిచేసిన వాళ్లకే టికెట్లు వస్తాయని చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఈటల రాజేందర్ అనుచరులను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని కొందరు నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కావాలనే ఈటల అనుచరులకు పర్యటన సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అయితే ఒక ప్రణాళిక ప్రకారంగా ఈటల వర్గాన్ని అణచివేస్తుందుకే కుట్రలు చేస్తున్నారని మాడ గౌతంరెడ్డి, తన అసెంబ్లీ కన్వీనర్ పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖ రాశాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్గత, ఆధిపత్య పోరు ఈటల రాజేందర్ వర్గాన్ని ఒక ప్రణాళిక ప్రకారంగా అవమానాలకు గురి చేస్తున్న తీరుతో కలతచెందానని, అందుకే రాజీనామా చేస్తున్నానని అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా బండి పర్యటన రోజే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు ముఖ్య నాయకులు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.