Singareni | యైటింక్లయిన్ కాలనీ, జూన్ 12: సింగరేణి సంస్థలో డీజిల్, పెట్రోలు ఇంధనాల వినియోగం తగ్గించి పర్యావరణ హిత గ్యాస్ వినియోగంను ప్రోత్సహించేందుకు చురుకుగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆర్జీ-2 ఏరియాను గురువారం పరిశీలించారు. కార్పొరేట్ జీఎం రాజు, అధ్యయన కమిటీ డైరెక్టర్ మేజర్ శంకర్ కరాజాగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే సింగ్ ఉన్నారు.
ముందుగా ఆర్జీ- 2 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఇంధన వినియోగ పద్ధతులు, వాహనాల ప్రాసెస్, పరికరాల పనితీరు, పర్యావరణ హిత చర్యలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకొని వ్యూ పాయింట్ ద్వారా స్థల పరిశీలన చేసి క్వారీలోకి వెళ్లి పని స్థలాలను పరిశీలించారు. నేచురల్ గ్యాస్ వాడకం సాధ్య సాధ్యాలపై ఈ బృందం సమగ్రంగా అధ్యయనం చేస్తుందన్నారు.
ఈ విధానం ద్వారా సంస్థలో కాలుష్యంను తగ్గించడంతోపాటు ఆర్థికంగా కూడా మేలైన ఫలితాలు సాధించగలమనన్న ఆశాభావంను కార్పొరేట్ జీఎం రాజు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ నరసింహారావు, ఓసీపీ-1 పీఓ ఉదయ్ హరిజన్, ఇంజనీర్ రాజాజీ, షావెల్ సెక్షన్ ఇన్ఛార్జి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.