మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వరుస విచారణలు కలకలం రేపుతున్నవి. ‘బేటీ బచావో.. బేటీ పడావో’లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాల గుట్టు ఇంకా తేలక పోవడం, ఇదే విషయమై పదే పదే విచారణలు జరుగడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ఉద్యోగులను వేధిస్తున్నారని వరంగల్ ఆర్జేడీకి అందిన ఫిర్యాదుపై కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు కార్యాలయంలో రెండు రోజులుగా విచారణ చేస్తుండగా, శాఖలో విచారణలే గానీ, చర్యలు ఉండవనే చర్చ జరుగుతున్నది. అందుకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాల గుట్టు ఇప్పటికీ వీడక పోవడమే నిదర్శనంగా చెప్పొచ్చు.
కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 12 : జిల్లా మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ పదిహేనేళ్లుగా అనేక కుంభకోణాలు, అవినీతికి పెట్టింది పేరుగా మారిందన్న ఆరోపణలు గతంలోనే వెల్లువెత్తాయి. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన కోట్ల విలువైన సామగ్రి, సరుకులు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకందించే పౌష్టికాహార సరుకులతోపాటు వాటి సరఫరాలోనూ అనేక అవకతవకలు జరిగాయనే ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
వాటిపై సంబంధిత శాఖకు చెందిన పైస్థాయి అధికారులు విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామనడమే గానీ, అక్రమాల నిగ్గు తేల్చింది లేదనే విమర్శలున్నాయి. అసలు ఉన్నతాధికారులకు నివేదికలు అందాయా..? అందితే వాటిలో ఏమున్నది? ఉంటే చర్యలు ఎందుకు జరగడం లేదనే చర్చ జరుగుతున్నది. అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణ పొందుతున్నా ఇంకా విచారణలు కొనసాగుతుండడం వెనుక మర్మమేమిటని శాఖలోని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.
ఈ విచారణ అటకెక్కినట్టేనా..?
కేంద్ర ప్రభుత్వం ప్రయోజిత కార్యక్రమం ‘బేటీ బచావో.. బేటీ పడావో’లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఇప్పటికీ ఎటూ తేలలేదంటే శాఖలో ఎంత నిర్లక్ష్యం రాజ్యమేలుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం కింద బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, వారి సంక్షేమంపై పలు ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లాకు మొదట్లో ఏటా 15 లక్షలు, అనంతరం 30 లక్షలు విడుదల చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి ఈ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ, తప్పుడు బిల్లులతో పక్కదారి పట్టించారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.70 శాతానికి పైగా నిధులు ప్రచార పటాటోపానికే ఖర్చు చేసినట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కమిషనరేట్ స్థాయి అధికారులు వచ్చి పలుసార్లు విచారణ జరిపారు.
బాధ్యులైన అధికారులను విచారించారు. ఖర్చులకు సంబంధించిన ఆధారాలు, బిల్లులు సేకరించి అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. రూ.లక్షల్లో నిధులు దుర్వినియోగమైనట్టు తేల్చి ఉన్నతాధికారులకు నివేదించారు. రికవరీకి సైతం ఆదేశించారు. కానీ, ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు. ఈ అవినీతిలో భాగస్వాములైన వారిలో ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోగా.. మరో అధికారి ఉద్యోగ విరమణ పొందారు. మరో ముగ్గురిలో ఒకరు ఉన్నత కేడర్లో, ఇద్దరు ఆ కింది స్థాయిలో జిల్లాలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విచారణ అటకెక్కినట్లేనని శాఖలోని ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. కేంద్ర మంత్రిగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ జోక్యం చేసుకున్నా ఈ విచారణ కొలిక్కి రాలేదంటే అవినీతిపరులు ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
కమీషన్ల బాగోతంపై విచారణ
చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీలో భాగంగా అందించే కోడిగుడ్లు, కందిపప్పు నాణ్యమైనది మాత్రమే సరఫరా చేయాలి. అందుకు భిన్నంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకమైన, తక్కువ గ్రేడ్ ఆహారపదార్థాలు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై సంబంధితాధికారులు ఎప్పటికప్పుడు కేంద్రాల్లో తనిఖీలు చేస్తూ పర్యవేక్షించాలి. అయితే, పప్పులు, కోడిగుడ్ల సరఫరాదార్ల నుంచి పెద్దమొత్తంలో కమీషన్లు తీసుకుంటూ వదిలేస్తున్నారని ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులతోపాటు శాఖ ఉన్నతాధికారులు కూడా మూడు నెలల కింద విచారణ జరిపారు. ఈ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరి ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి ఎవరి ద్వారా ఎవరికి కమీషన్లు అందుతున్నాయనేది సమగ్రమైన నివేదికను శాఖ ఉన్నతాధికారులకు అందించారు. అయినా, ఈ అక్రమాల గుట్టు ఇప్పటి వరకు వీడింది లేదు. ఎవరిపైనా చర్యలు తీసుకున్నది లేదు.
వేధింపులపై విచారణ
ఓ పక్క అక్రమాలు, అవినీతి ఆరోపణలను మూట కట్టుకుంటున్న మహిళా శిశు సంక్షేమం, వయోవృద్ధులు శాఖలో తాజా గా ఉద్యోగుల వేధింపుల గోల తెరపైకి వచ్చింది. తమ శాఖ ఉన్నతాధికారులతోపాటు కొందరు మినిస్టీరియల్ ఉద్యోగులు తమను ఇష్టమున్నట్లు వేధిస్తున్నారని, కార్యాలయానికి వస్తే గంటల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారని, అంగన్వాడీ టీచర్ల యూనియన్ నాయకులకు ఇచ్చిన విలువ తమకు ఇవ్వడం లేదని శాఖలోని పలువురు సూపర్వైజర్లు, కింది స్థాయిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కరీంనగర్లోని అర్బన్ ప్రాజెక్టు కార్యాలయంలో ఈ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు ఝాన్సీలక్ష్మీ విచారణ చేపట్టారు. ఈ విచారణ బుధవారం కూడా కొనసాగింది.
శాఖలోని అధికారితో పాటు మినిస్టీరియల్ ఉద్యోగిపై రెండు రోజులుగా జరుగుతున్న విచారణ శాఖలో కలకలం రేపింది. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలోని అధికారులు, సిబ్బంది, అనుబంధ విభాగాల ఉద్యోగులను సదరు అధికారి సుదీర్ఘంగా విచారించారు. ఆశాఖ అనుబంధ విభాగాలైన డీహబ్, ఐసీపీఎస్, సఖీ, చిల్డ్రన్ హోం సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని విచారించి, ఆరోపణలకనుగుణంగా ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా సంక్షేమాధికారి, సీనియర్ అసిస్టెంట్లను కూడా విచారించి, సంబంధిత వివరాలతో కూడిన నివేదికను డైరెక్టర్ శృతి ఓజాకు అందజేయనున్నట్టు ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే, ఈ విచారణనైనా కొలిక్కి వచ్చి బాధ్యులపై చర్యలు ఉంటాయా..? లేక మొదటి రెండు విచారణల మాదిరిగానే అటకెక్కుతాయా..? అనే చర్చ శాఖలో జోరుగా జరుగుతున్నది.