ధర్మపురి గోదావరిలో ఇసుక తుపాన్ చెలరేగింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన అక్రమ దందా.. జగిత్యాల జిల్లా రాజకీయాలను కుదిపేస్తున్నది. ఒకప్పుడు నదీ తీరం వరకే పరిమితమైనా.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుతున్నది. రాజకీయ రంగు పులుముకొని రచ్చ రచ్చ అవుత్నునది. రోజూ లక్షల్లో వ్యాపారం చేసే మాఫియా ‘మేం గరీబోళ్లం.. మా పొట్ట కొట్టొద్దు’ అంటూ ఓ వైపు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మొసలి కన్నీరు కారుస్తూనే, మరోవైపు ఓ కీలక నేతకు సంబంధం లేదంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మొత్తంగా ఈ వివాదం ఎటువైపు తిరుగుతుందో..? ఎవరి రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందో..? అన్న ఆందోళన అధికారపార్టీలో కనిపిస్తున్నది.
ధర్మపురి, జూన్18 : ధర్మపురి ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందాను ‘నమస్తే తెలంగాణ’ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ‘గోదావరిలో ఇసుక మాఫియా’ అనే శీర్షికన గత నెల 30న కథనం ప్రచురించిన విషయం విదితమే. కేవలం ఒక్క ఆరెపల్లి గ్రామంలోనే నెలకు రూ.3 కోట్లకు పైగా ఇసుక దందా నడుస్తున్నదని వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపింది. ఇప్పటి వరకు మైనింగ్, విజిలెన్స్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు దాడులు చేస్తూ వచ్చారు. రాజకీయ ఒత్తిళ్లను అధిగమిస్తూ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిళ్లతో లాభం లేకుండా పోయినట్టు తెలుస్తున్నది.
అధికారులు కష్టపడి సీజ్ చేసిన డంపులను ఓ ముఖ్య నేత ఫోన్ కాల్‌తో వదిలిపెట్టినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఇసుక మాఫియా మొసలి కన్నీరు కారుస్తున్నది. పైగా ‘గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుమ్ముకున్నట్టు’ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నది. ‘మేము గరీబోళ్లం. ఇసుక తోడుకొని బతుకుతున్నం. మా పొట్టకొట్టొద్దు. అందులో ఇసుక అక్రమ రవాణాకు ముఖ్య నేతకు సంబంధం లేదు. ముడుపులు ఇవ్వడం లేదు’ అని ఏకంగా ఒక కీలక నేత పేరును ప్రస్తావిస్తూ కొందరు వ్యక్తులు వీడియోలు వైరల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు తమ కార్యకలాపాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు.
కానీ, ఇక్కడ బరితెగింపు కనిపిస్తున్నది. ఏకంగా ప్రజాప్రతినిధుల పేర్లను ప్రస్తావిస్తూ బహిరంగంగా పోస్టులు పెట్టడం వెనుక ఉన్న ధైర్యం ఏమిటి? ఎవరి భరోసాతో ఈ తరహా ప్రచారానికి దిగుతున్నారు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి లేకుండా ఓ కీలక నేత పేరును ప్రస్తావిస్తూ.. డబ్బులు ఇవ్వడం లేదని చెప్పేంత ధైర్యం ఇసుక మాఫియాకు ఉందా..? నిజంగా వారికి ఎలాంటి సంబంధం లేకుంటే సదరు నేత పేరును ఇంత ధైర్యంగా వాడుకోగలరా..? అధికార యంత్రాంగం ఎందుకు మౌనం పాటిస్తున్నది? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సిన అవసరం ఉన్నది. ఒక ప్రజాప్రతినిధి పేరు అక్రమ వ్యవహారాల చర్చలోకి రావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇసుక మాఫియా పోస్టులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిలోని ఇసుకతో కోట్ల రూపాయల వ్యాపారం చేసే బాగోతాన్ని పేదల ఉపాధిగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు గోదావరి గర్భంలో డోజర్లు, జేసీబీలతో ఇసుక తవ్వకాలు, అవసరమైతే గోదావరిలో తాత్కాలిక దారులు వేసి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రవాణా చేస్తున్నా సంబంధిత శాఖలు ఎందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గనులు, భూగర్భశాఖ, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల పనితీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఇసుక అక్రమ రవాణా అంశం రాజకీయ రంగు పులుముకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఈ వ్యవహారం ఓ ప్రజాప్రతినిధికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చిందనే చర్చ సాగుతున్నది. ధర్మపురిలో జరుగుతున్న పరిణామాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తుండగా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వివాదాన్ని మరింత రాజేస్తున్నది. ఈ వ్యవహారంపై ప్రజల ప్రశ్న మాత్రం స్పష్టంగా ఉంది. నిజంగా ఇసుక అక్రమ రవాణా అధికార పార్టీ అండదండలు లేకుండా జరుగుతున్నదా..? దీనిని అడ్డుకునే బాధ్యత ఎవరిదీ? స్వాధీనం చేసుకున్న ఇసుక డంపుల లెక్కలు ఏమిటీ? కోట్ల రూపాయల వ్యాపారం వెనుక ఉన్న అసలు కథ ఏమిటీ? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం రావాల్సిన అవసరం ఉన్నది.
జిల్లాలో ప్రస్తుతం ఇసుక రీచ్‌లు అందుబాటులో లేవు. భూగర్భజలశాఖ ద్వారా సమగ్ర అధ్యయనాలు చేసి ఇసుక తవ్వకాలకు అనువైన ప్రాంతాలను గుర్తించి, రీచ్‌లు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. తక్కువ ధరలోనే ఇసుక దొరికే చాన్స్ ఉంటుంది. కానీ, ధర్మపురి ప్రాంతంలో అక్రమ రవాణాతో సహజ సంపద తరలిపోతున్నది. కొందరి అక్రమ సంపాదనకు మార్గంగా మారింది. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. ఇంత జరుగుతున్నా ఇసుక దందాకు పూర్తి స్థాయిలో చెక్ పడడం లేదు. కండ్ల ముందు నుంచే కోట్లాది రూపాయల ఇసుక అక్రమంగా తరలుతున్నా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.