పక్క చిత్రంలో కనిపిస్తున్న ఆయన పేరు ఏ లక్ష్మయ్య.. రిటైర్డ్ ఆర్టీవో.. డ్యూటీలో ఉండగా పలుసార్లు ఉత్తమ అధికారిగా అవార్డులు అందుకున్నాడు. కానీ, నిజజీవితంలో మాత్రం రెవెన్యూ అధికారుల (లీలలు) చేతిలో ఓటమి పాలవుతున్నాడు. తనతోపాటు తన కుటుంబసభ్యుల వ్యవసాయ భూమికి సంబంధించి రికార్డుల్లో తప్పులు దొర్లాయని, తనకు తెలియకుండానే ధరణి నుంచి తన కుటుంబసభ్యుల 4.20 ఎకరాల వ్యవసాయ భూమి తగ్గించారని, వాటిని సవరించి న్యాయం చేయాలంటూ రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. సీఎం నుంచి సీసీఎల్ఏ వరకు దరఖాస్తులు పెడుతూ వస్తున్నాడు. కేవలం రికార్డులను సరిచేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ, రెండేళ్లుగా తిరుగుతున్నా.. సదరు భూమి మోఖాపై లక్ష్మయ్య కుటుంబ సభ్యులే ఉన్నా రెవెన్యూ అధికారులు మాత్రం కనికరం చూపడం లేదు. ఈ తప్పులన్నీ వారే చేసినా రికార్డులను సరిదిద్దడం లేదు. చివరకు ప్రస్తుత కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో మహేశ్వర్ స్పందించి మేలో లేఖ రాసినా.. నేటికి గంగాధర మండల రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదు. రేపు మాపంటూ ముప్పు తిప్పులు పెడుతుంటే సదరు రిటైర్డ్ ఆర్టీవో చేయని తప్పుకు రెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్న తీరు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నది.
కరీంనగర్, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లె గ్రామంలోని సర్వేనంబర్ 148లోని 15 ఎకరాల భూమిని రిటైర్డ్ ఆర్టీవో ఏ లక్ష్మయ్య కుటుంబసభ్యులు నాలుగు దశాబ్దాలకు ముందే కొనుగోలు చేశారు. లక్ష్మయ్య భార్య రమాదేవిపై తొమ్మిది ఎకరాలు, అతడి కొడుకులు నవీన్‌కుమార్‌పై మూడెకరాలు, ప్రవీణ్‌కుమార్‌పై మూడెకరాల భూమిని కొని, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత నవీన్‌కుమార్ చనిపోగా, ఆయన పేరుపై ఉన్న మూడెకరాల భూమి విసరాసత్ ద్వారా తండ్రి లక్ష్మయ్య పేరుపైకి రాగా.. ఆ స్థలాన్ని ప్రవీణ్‌కుమార్ పేరుపై (డాక్యుమెంట్ నంబర్ 411/1999) రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో ప్రవీణ్‌కుమార్ ఆరెకరాలకు యజమాని అయ్యాడు.
కాగా, వీరి భూమి నుంచే కరీంనగర్-జగిత్యాల రైల్వేలైన్ వెళ్లడంతో రమాదేవి స్థలం నుంచి 3.25 ఎకరాలు, ప్రవీణ్‌కుమార్ స్థలం నుంచి 39 గుంటలు అంటే మొత్తం 4.24ఎకరాలు పోయింది. ఆ మేరకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేసి, పరిహారం కూడా చెల్లించారు. ఆ స్థలాన్ని పాత పట్టాదారు పాసుపుస్తకంతోపాటు రికార్డుల నుంచి తొలగించారు. రైల్వే లైన్ కింద పోయిన స్థలాన్ని మినహాయిస్తూ రమాదేవిపై 5.15 ఎకరాలు, ప్రవీణ్‌కుమార్ పేరుపై 5.01 ఎకరాలను చూపుతూ ధరణిలో నమోదు చేయడంతోపాటు ఆ మేరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు (రమాదేవి పేరుతో పాస్ బుక్‌నంబర్ టీ 17040150119 అలాగే ప్రవీణ్‌కుమార్ పేరుతో టీ 17040150059 జారీ చేశారు) ఇచ్చారు. ఇక్కడి వరకు వ్యవస్థ అంతా నిబంధనల ప్రకారమే నడిచింది.
రెవెన్యూ అధికారుల లీలలు
మోఖా మీద ఉండడంతోపాటు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు రావడం, ధరణి రికార్డుల్లోనూ ఆ సమయంలో అంతా సవ్యంగా ఉండడంతో లక్ష్మయ్య కుటుంబ సభ్యులు వ్యవసాయం కొనసాగిస్తూ వస్తున్నారు. మధ్యలో ఒక అవసర నిమిత్తం ధరణి సైట్లోకి వెళ్లి చూస్తే ఏ రమాదేవి పేరుపై 5.15 ఎకరాలు ఉండాల్సిన చోట 1.30 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నది. అంటే 3.25 ఎకరాల స్థలాన్ని ఆమె ఖాతా నుంచి తగ్గించారు. అలాగే ప్రవీణ్‌కుమార్ పేరుపై 5.01 ఎకరాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ధరణి సైట్లో చూస్తే 4.06 ఎకరాలు మాత్రమే ఉన్నది. అంటే 35 గుంటల స్థలాన్ని ధరణి నుంచి డీలీట్ చేశారు. లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు సంబంధించి రైల్వే లైన్‌కింద 4.24 ఎకరాల స్థలం పోగా, రమాదేవి, ప్రవీణ్‌కుమార్ స్వాధీనంలో ఇంకా 10.16 ఎకరాలు వ్యవసాయ భూమి ఉండాలి. కానీ, ప్రస్తుతం ధరణిలో మాత్రం ఇద్దరిది కలిపి 5.36 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నది.
నిజానికి ఇంకా వీరికి 4.20 ఎకరాలు కలువాల్సి ఉన్నది. ధరణి నిబంధనల ప్రకారం చూస్తే.. ఒకసారి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం జారీ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ యజమాని వేలిముద్ర లేకుండా భూముల్లో మార్పులు చేర్పులు చేయడానికి వీలులేదు. కానీ, ఇక్కడ మాత్రం అధికారులు ఆ నిబంధనలను తుంగలో తొక్కి, భూములను ఏకం గా రికార్డుల్లో తగ్గించారు. యజమానులకు కనీస సమాచారం ఇవ్వలేదు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు విడుదలైన తర్వాత వారి నోటీసులో లేకుండా, అలాగే వేలి ముద్రలు లేకుండా భూములను రెవెన్యూ అధికారులు ఎలా మార్పు చేశారన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నది. దీనిని బట్టి రెవెన్యూ అధికారులు ఏదైనా చేయగల సమర్థులన్న విషయం తేటతెల్లం అవుతున్నది. ఈ తప్పులు ఇంతటితో ఆగలేదు. లక్ష్మయ్య భూముల తగ్గింపు వ్యవహారంలో అధికారులు మరో లీల చూపారు.
నిజానికి చనిపోయిన కొడుకు నుంచి విరాసత్ ద్వారా సక్రమించిన మూడెకరాల భూమిని చిన్న కొడుకు ప్రవీణ్‌కుమార్‌పై తండ్రి లక్ష్మయ్య 1999లోనే గిప్టు రిజిస్ట్రేషన్ చేశాడు. ఆమేరకు పాత పట్టాదారు పాసుపుస్తకాల్లో లక్ష్మయ్య పేరును తొలగించారు. అయితే ధరణి వచ్చిన సమయంలో తిరి గి తన పేరుపైనే ఆ మూడెకరాల భూమి ఉన్నట్టు రికార్డుల్లో నమోదైనట్టు గుర్తించిన లక్ష్మయ్య తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరుపై ఉన్న భూమిని తన కొడుకు ప్రవీణ్‌కుమార్‌కు రిజిస్ట్రేషన్ చేశానని, ధరణి రికార్డుల నుంచి తన పేరును తొలగించాలని దరఖాస్తులో కోరడంతో అప్పుడు అధికారులు తొలగించారు. కానీ, తీరా చూస్తే ఇప్పుడు మళ్లీ లక్ష్మయ్య పేరుపైనే మూడెకరాల భూమి ధరణిలో కనిపిస్తున్నది.
కలెక్టర్ ఆదేశించినా స్పందన శూన్యం
తన పేరుపై ఉన్న మూడెకరాలను కొడుకు పేరుపైకి మార్చడంతోపాటు గతంలో జారీచేసిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలకు అనుగుణంగా రికార్డులను సరిదిద్ది తనకు న్యాయం చేయాలని లక్ష్మయ్య రెండేళ్లుగా పోరాటం చేస్తున్నాడు. జరిగిన తప్పులను సవరించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ నుంచి ముఖ్యమంత్రి.. సీసీఎల్ఏ వరకు దరఖాస్తులు చేశాడు. అంతేకాదు, మొత్తం స్థలం మోఖాపై తమ కుటుంబమే ఉందని, కేవలం అధికారులు చేసిన తప్పులను సరిదిద్దితే తనకు న్యాయం జరుగుతుందని పేర్కొంటూ లేఖలు రాయడంతోపాటు ఆధారాలను జతచేసి అధికారులకు అనేకసార్లు పంపాడు. చివరకు ధరణి సైట్లో ఇచ్చిన ఆప్షన్లను వినియోగించుకొని.. 2022 డిసెంబర్ 31న కరెక్షన్ కోసం రెండుసార్లు ఆన్లైన్ (అప్లికేషన్ నంబర్స్ 2200178547 అలాగే 2200178522)లో దరఖాస్తు చేశాడు.
అయినా న్యాయం జరగలేదు. కాగా, ఫిబ్రవరి 7న లక్ష్మయ్య దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి (లేఖ నంబర్ ఈ3/1143/2024 తేదీ 4.05.2024) ఆర్డీవోకు ఉత్తర్వులు జారీ చేశారు. అర్జీదారుడి వివరాలు పరిశీలించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ వెంటనే స్పందించి, గంగాధర తహసీల్దార్‌కు మే6న లేఖ (నంబర్ డీ1/3158/2004) రాశారు. అర్జీదారుడు పేర్కొన్న అంశాలపై విచారణ చేసి, అసంబద్ధంగా తొలగించిన (డిడెక్షన్) వాటిని కరెక్షన్ చేసి, రిపోర్ట్ పంపాలని ఆర్డీవో తన లేఖలో స్పష్టం చేశారు. కానీ, నేటి వరకు అతీగతీ లేదు. గంగాధర రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఆర్డీవో పంపిన లేఖపై స్పందించిన దాఖలాలు లేవు. రేపు మాపు అంటూ.. రిటైర్డ్ ఆర్టీవోను తిప్పుకోవడమే తప్ప న్యాయంచేసే దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు. అయినా న్యాయబద్ధంగా తన కుటుంబ సభ్యులకు రావాల్సిన హక్కుల కోసం లక్ష్మయ్య పోరాటం చేస్తూనే ఉన్నాడు.
ఆర్డీవో లేఖపై గంగాధర రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో ధరణిలో ఆగస్టు 14న ఒకసారి (నంబర్ 2400081406), సెప్టెంబర్9న మరోసారి (నంబర్ 2400094203) దరఖాస్తు చేశాడు. పలుసార్లు ప్రజావాణిలోనూ దరఖాస్తు చేశాడు. నిజానికి జరిగిన తప్పులను సరిదిద్దడానికి ధరణిలో స్పష్టమైన ఆప్షన్ ఉన్నది. అధికారులు అనుకుంటే 48 గంటల్లో సరిదిద్ది అర్జీదారుడికి న్యాయం చేయవచ్చు. కానీ, కలెక్టర్, ఆర్డీవో ఆదేశించినా సదరు మండలం నుంచి ఫైలు కదలడం లేదంటే.. క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘కాసులు లేకుండా ఫైలు కదపరు’ అన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న రెవెన్యూ అధికారులు.. లక్ష్మయ్య విషయంలోనూ అదే ఆలోచనలో ఉన్నారా..? లేక పై అధికారుల ఆదేశాల మేరకు తప్పులను సరిదిద్ది న్యాయం చేస్తారా..? అన్నది వేచి చూడాల్సి ఉన్నది. కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతుండగా, రెండేళ్లుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో లక్ష్మయ్య మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ ప్రభావం అతడి ఆరోగ్యంపై పడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కు టుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.