Urea | మల్లాపూర్, సెప్టెంబర్ 7: గ్రామాల్లో యూరియా సంచుల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓ పక్క వరి పంటకు పొట్ట దశకు వచ్చే పరిస్థితి ఉండటంతో ఈ చాలిచాలని అందని యూరియా సంచుల కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. సంచుల కోసం పండుగలు, పబ్బలు, వ్యక్తిగత పనులను సైతం పక్కన బెట్టి యూరియా వచ్చిన కేంద్రాలకు రైతులు వేకువజామునే పరిగెత్తాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆదివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ సహకార సంఘంకు 320 యూరియా సంచులతో కూడిన ఓ లారీ వచ్చింది.
ఈ సహకార సంఘం పరిధిలో సిరిపూర్, మొగిలిపేట, నడికుడ గ్రామాలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మూడు గ్రామాలకు చెందిన రైతులు వేకువజామునే కార్యాలయంకు చేరుకొని సంబదిత దరఖాస్తుల జిరాక్స్ ప్రతులతో కార్యాలయం తెరవక ముందే పాటు, చెప్పులు, చీపర్లు, ఖాళీ మద్యం సీసాలు, చెట్ల కొమ్మలు, ఖాళీ యూరియా సంచులు, పాత బట్టలను క్యూ లైన్లో వేచిఉన్నారు. చివరికి కేవలం రైతుల భూముల పట్టాలను బట్టి ఒకటి, రెండు సంచుల చొప్పున సహకార సంఘ సిబ్బంది అందజేశారు. చేసేది ఏమి లేక చాలా మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
రైతులను ఇబ్బంది పెట్టిన ఏ సర్కార్ బాగు పడలేదు : ఏనుగు రవీందర్ రెడ్డి, రైతు, సిరిపూర్ గ్రామం, మల్లాపూర్ మండలం
ప్రతీ రోజు యూరియా సంచుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. గత రెండు నెలల నుండి రైతులు యూరియా సంచుల కోసం ఆందోళన చెందింతే ఏ నాయకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. కచ్చితంగా కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు అనాటి రోజులు మళ్లీ వచ్చినాయి, ఈ మార్పును రైతులందరు మంచిగా గమనిస్తుండ్రు. వచ్చే ఎన్నికల్లో రైతులు అంటే ఏమిటో సర్కార్ కు చూపించడం ఖాయం. గ్రామాల్లో యూరియా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తే, పెద్ద లీడర్లు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండ ఫైవ్ స్టార్ హోటళ్లలో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. రైతులను పట్టించుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైంది.
ఒకటి, రెండు సంచులు ఏమి సరిపోతాయి : ఎల్లాల జీవన్ రెడ్డి, రైతు, మొగిలిపేట, మల్లాపూర్ మండలం
వరి పంట అంత పొట్టకు వచ్చింది. నేను వరిపంటను నాకు ఉన్న భూమిలో ఎక్కువ శాతం పండిస్తాను. గీన్ని గంటలు నిల్చోని తీసుకున్న ఈ ఒకటి, రెండు సంచులు నాకు ఏమి చేసుకోవాలో అర్థం కావడం లేదు. సంచులు వస్తున్నయానే తెలిస్తే చాలు రైతులందరు అన్ని పనులకు పక్కన బెట్టి యూరియా కోసం వస్తున్నారు. అసలు సర్కార్ గీన్ని కష్టాలు రైతులను ఎందుకు పెడుతుందో, రైతుల కష్టాలను పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఈ రెండు సంచుల కోసం వచ్చినప్పుడల్లా జిరాక్సులకే మాకు ఖర్చు అవుతుంది. అయిన సంచులు దొరుకుతాయో, లేదో అంటూ పొద్దున లేచి ఇక్కడికే రావాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. గ్రామాల్లోని రైతులు ఇప్పుడు యూరియా అంటే బంగారంగా అనుకునే పరిస్థితి ఉంది.