ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కదిరె శ్రీకాంత్ సస్పెన్షన్ వ్యవహారం పోలీస్, రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌లా మారింది. ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐపై విచారణ జరిపించిన సీపీ గౌష్ ఆలం.. ముందుగా అటాచ్ చేసి, ఆ తర్వాత సస్పెండ్ చేయగా.. అందులో మితిమీరిన రాజకీయ జోక్యం ఆయన మనసును కలిచివేసినట్టు తెలుస్తున్నది. డిపార్ట్‌మెంట్‌పరంగా చర్యలు తీసుకోకుండా రాజకీయ ఒత్తిడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన సీపీ, ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఎస్ఐని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుండగా, ఆ తర్వాత రాజకీయ జోక్యం పెరగడం.. అది చిలికి చిలికి పెద్దదిగా మారడం.. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న బాస్, ప్రస్తుతం సెలవులో వెళ్లినట్టు తెలిసింది. ఓ క్లారిటీ వచ్చే వరకు సీపీ వేచిచూసే అవకాశముందనే చర్చ పోలీస్‌వర్గాల్లో నడుస్తుండగా, తాడోపేడో తేల్చుకునేందుకే సదరు రాజకీయనేత సిద్ధమైనట్టు తెలుస్తున్నది.ఇదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారులు కూడా సీపీకి పూర్తిగా అండాలని భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
కరీంనగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో కొంతకాలంగా ఎస్ఐగా పనిచేస్తున్న కదిరే శ్రీకాంత్ సస్పెన్షన్ వ్యవహారం ప్రస్తుతం ఇటు పోలీసు, అటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద దుమారమే రేపుతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే.. శ్రీకాంత్‌పై వివిధరకాల ఆరోపణలు సీపీకి అందినట్టు తెలుస్తున్నది. అందులో ప్రధానంగా ఇసుక దందాలు నడిపే వారి నుంచి మామూళ్లు సేకరిస్తున్నట్టు పలు ఫిర్యాదులు పోలీస్‌బాస్‌కు అందాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తున్నది. వాటిని పరిగణలోకి తీసుకున్న సదరు బాస్, విచారణ జరిపించారు. ఆ మేరకు వచ్చిన రిపోర్టును పరిగణలోకి తీసుకొని, స్టేషన్ నుంచి తొలగిస్తూ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇక్కడి వరకు డిపార్టుమెంట్ పరంగానే చర్యలు జరిగాయి. వీటితోపాటు మరిన్ని ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తున్నది.
రాజకీయ జోక్యం.. సస్పెన్షన్
అత్యంత విశ్వనీయ సమాచారం ప్రకారం చూస్తే.. అటాచ్ చేయగానే సదరు ఎస్ఐ తరఫున ఓ అధికార పార్టీ రాజకీయ నేత రంగంలోకి దిగారు. ‘ఎస్ఐ నా మనిషి. మీరెలా అటాచ్ చేస్తారు’ అంటూ ప్రశ్నించడంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అటాచ్మెంట్ రద్దు చేయడంతోపాటు తిరిగి యధావిధిగా ఎల్ఎండీలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. అందుకు డెడ్‌లైన్ కూడా విధించినట్టు తెలుస్తున్నది. ఓ ఉన్నత స్థానంలో ఉండి, డిపార్టుమెంట్పరంగా తన పని తాను చేసుకొని వెళ్తుంటే ఈ రాజకీయ జోక్యం ఏంటని భావించిన సీపీ, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తున్నది.
ఆ మేరకు వచ్చిన ఆరోపణలపై మరింత లోతుగా విచారణ చేయించినట్టు సమాచారం. అంతేకాదు, అందుకోసం కొన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్‌ను కూడా సంపాదించినట్టు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అలాగే కొన్ని వాయిస్ రికార్డులు కూడా సేకరించారని సమాచారం. వీటిని ఆధారంగా చేసుకున్న బాస్, పూర్తి సమాచారంతోపాటు రాజకీయ నాయకుల జోక్యాన్ని, ఆయనపై వచ్చిన రాజకీయ ఒత్తిడి, అసందర్భంగా సదరు రాజకీయ నేత మాట్లాడిన తీరు, మాటల వంటి అంశాలను డిపార్టెమెంట్లోని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారని అత్యంత విశ్వసనీయ సమాచారం. అన్నింటినీ పరిశీలించిన పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎస్ఐని సస్పెండ్ చేసినట్టు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
సెలవుపై వెళ్లిన సీపీ?
ఎస్ఐని సస్పెండ్ చేయడంతో అప్పటికే కోపంతో ఊగిపోతున్న సదరు నేత, మరింత మండిపడినట్టు తెలుస్తున్నది. ‘నువ్వో.. నేనో తేల్చుకుందాం’ అంటూ సీరియస్‌గా మాట్లాడినట్టు సమాచారం. ఇదే సమయంలో ఓ మంత్రి కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఎస్ఐ సస్పెన్షన్ ఎత్తివేయాలని గౌష్ ఆలంతోపాటు పోలీస్ ఉన్నతాధికారులకు కూడా సదరు మంత్రి హుకుం జారీ చేశారని సమాచారం. దీంతో సేకరించిన అన్నీ ఆధారాలను ఉన్నతాధికారులు సదరు మంత్రికి పంపించారని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నది. అలాగే రాజకీయ జోక్యం, మాట్లాడిన తీరు వంటి అంశాలను కూడా వివరించారని తెలిసింది. దీంతో మంత్రి కొంత వెనక్కి తగ్గారని పోలీస్ వర్గాల ద్వారా సమాచారం. అయితే సదరు రాజకీయ నేత మాత్రం.. పోలీస్ బాస్‌పై మరింత ఒత్తిడి పెంచినట్టు తెలుస్తున్నది.
ఈ క్రమంలో తీసుకున్న చర్యలను వెనక్కి తీసుకునే ప్రశ్నేలేదన్న ఉద్దేశంతో సీపీ ఉన్నట్టు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆరోపణలు వస్తే.. ఒక ఐపీఎస్ అధికారిగా విచారణ చేయించి చర్యలు తీసుకునే అధికారం తనకు లేదా..? అంటూ కొంత మంది పోలీసులతో తన అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో జరిగిన, జరుగుతున్న పూర్తిస్థాయి పరిణామాలను పై అధికారులకు వివరించిన సీపీ, ప్రస్తుతం సెలవులో వెళ్లినట్టు తెలుస్తున్నది. అయితే ఈ వివాదం సద్దుమణిగి మళ్లీ సీపీ వస్తారా..? లేక దీర్ఘకాలిక సెవులో ఉంటారా..? అన్నదానిపై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఓవరాల్‌గా చూస్తే రాజకీయ క్రీడలో ఎస్ఐ, సీపీ నలుగుతున్నారన్న చర్చ కూడా నడుస్తున్నది. నిజానికి ఇసుక మాముళ్ల విషయమంతా బడా నాయకుడి వద్ద పనిచేసే ఓ ప్రజాప్రతినిధి అండదండలతోనే నడిచాయన్న ప్రచారం జరుగుతున్నది. ఆయన సూచనల ప్రకారమే సదరు అధికారి ముందుకెళ్లినట్టు తెలుస్తున్నది.
ఇప్పుడు అదే వ్యవహారం ఎస్ఐ మెడకు చుట్టుకున్నట్టు చర్చ నడుస్తున్నది. ఈ పరిణామ క్రమంలోనే సదరు ప్రజాప్రతినిధి బడా నేతతో పోలీస్ అధికారులపై ఒత్తిడి చేయించారన్న టాక్ వినిపిస్తున్నది. పరిస్థితులను నిశితంగా చూస్తే రాజకీయ జోక్యం సీపీని మనస్తాపానికి గురిచేయడంతోపాటు అటాచ్‌తో పోయే ఎస్ఐ వ్యవహారం చివరకు సస్సైన్షన్ వరకు వచ్చిందన్న చర్చ ప్రస్తుతం పోలీసువర్గాల్లో జోరుగా సాగుతున్నది. కాగా, సదరు నేత ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా అదే ధోరణితో ఉన్నట్టు సమాచారం వస్తున్నది. దీంతో పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అన్న చర్చ సాగడంతోపాటు ఓ ఎస్ఐ సస్పెన్షన్ వ్యవహారం ఇంత హాట్‌టాపిక్‌లా మారడం ఉమ్మడి జిల్లాలోనే ఇదే ప్రథమం అన్న చర్చకూడా పోలీస్‌వర్గాల్లో సాగుతున్నది.