Indiramma House | సారంగపూర్ : ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వికలాంగుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ వికలాంగుడిని స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన చీర్నేని శ్రీనివాస్ వికలాంగుడు. ఆయన పక్కా ఇల్లు లేకపోవడంతో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ తనకు ఇల్లు మంజూరు కాలేదు. కానీ అదే మండల కేంద్రానికి చెందిన చాలా మంది భూస్వాములకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇదే విషయంలో పలుమార్లు శ్రీనివాస్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు కూడా శ్రీనివాస్ పట్ల సానుకూలంగా స్పందించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్.. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి రాత్రి వాట్సాప్ గ్రూపుల్లో మేసేజ్ పెట్టాడు.
అప్రమత్తమైన ఎస్ఐ రవి.. బాధిత వికలాంగుడిని పోలీసు స్టేషన్కు పిలిపించారు. అనంతరం కౌన్సెలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. అధికారులు ఫైనల్ చేసిన ఇండ్ల జాబితాలో తన పేరు లేదనే ఆవేదనతోనే ఇలా చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నాడు.