కరీంనగర్ కలెక్టరేట్, జూలై 10: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దివ్యాంగులకు 6వేల పెన్షన్‌తోపాటు వైకల్యానికి అనుగుణంగా పరికరాలు అందించాలని, ఇందిరమ్మ ఇండ్లు, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వేడుకున్నారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం రాజు మాట్లాడారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఇక్కడ దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు రాకేశ్, గొర్ల అయిలేశ్యాదవ్, సబ్బని రాములు, మానుక ప్రభాకర్, రాయికుంట వీరయ్య, బత్తిని సుధాకర్ ఉన్నారు.