తెలంగాణ చౌక్, జూన్ 27: అమ్మాయిల స్వీయ రక్షణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్‌శాఖ సరికొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. ఆపద సమయాల్లో విద్యార్థినులు ధైర్య సాహసాలు ప్రదర్శించి, తమను తాము రక్షించుకునేందుకు ‘ఆపరేషన్ జ్వాల’ పేరిట కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా జిల్లాలోని 113 ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. పది మంది నిష్ణాతులైన 10 మంది మాస్టర్లను ఎంపిక చేసి, ఒక్కో పాఠశాలలో 10రోజుల చొప్పున ట్రైనింగ్ ఇవ్వనుండగా, మొత్తంగా మూడు నెలల్లో దీనిని పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం సిరిసిల్లలోని మూడు పాఠశాలలు, వేములవాడలోని రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఆకతాయిల బారి నుంచి తప్పించుకోవడంతోపాటు చైన్ స్నాచింగ్, మహిళలపై లైంగిక దాడులు జరిగే క్రమంలో సమర్థవంతంగా తిప్పికొట్టే విధానం గురించి అనుభవమున్న మాస్టర్లు నేర్పిస్తున్నారు.
మంగళవారం జిల్లాకేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘ఆపరేషన్ జ్వాల’ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించి మాట్లాడారు. ఎదుటి వారి నుంచి దాడికి గురయ్యే సందర్భంలో ప్రతిఘటించేందుకు అమ్మాయిలు ధైర్యసాహసాలు పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని, వారికి సెల్ఫ్‌డిఫెన్స్ శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్రత్యేక షీ టీంలు పని చేస్తున్నాయన్నారు. వేధింపులకు గురైన సందర్భాల్లో వెంటనే షీ టీంను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
అనంతరం డీఈవో రమేశ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఎక్కడోచోట వేధింపులకు గురవుతున్నారని, దీనిని నిర్మూలించే బాధ్యత మనందరిపైనా ఉన్నదన్నారు. విద్యార్థులు సెల్ఫ్‌డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడంపై ఎస్పీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు అనిల్‌కుమార్, ఉపేందర్, ఎస్ఐలు రాజు, శ్రీకాంత్, రమేశ్, జిల్లా కోఆర్డినేటర్ పద్మజ, హెచ్ఎం భాగ్యరేఖ, మాస్టర్ మన్నాన్ తదితరులు పాల్గొన్నారు.
నిష్ణాతులతో శిక్షణ..
ఈ రోజుల్లో అమ్మాయిలకు సెల్ఫ్ డిపెన్స్ నేరుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిన సందర్భంగా ఆకతాయిల నుండి వచ్చే వేధింపులు అఘాయిత్యాలనుండి తమను తాము ధైర్యంతో రక్షించుకోగలమనే నమ్మకం కలుగుతంది. జిల్లా పోలీస్‌శాఖ ప్రత్యేక శ్రద్దతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినిలకు సెల్ఫ్డిపెన్స్ శిక్షణలో భాగంగా నిష్ణాతులతో మెళుకువలు నేర్పింస్తారు. దీని వల్ల శిక్షణ పొందిన విద్యార్థినులు వారు నేర్చుకున్న విద్యను ప్రతి రోజు ప్రాక్టీస్ చేసుకుంటే ఫిట్నేస్తో ఉండడమే కాకుండా ఉత్సహంగా ఉంటారు.