రామగుండం పోలీస్ పాలనా భవనం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, మంత్రి కేటీఆర్, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి, ఎమ్మెల్యే చందర్ సహకారంతో 38.50కోట్ల వ్యయంతో 29 ఎకరాల్లో రూపుదిద్దుకున్నది. ఆధునిక హంగులు, సకల వసతులతో దేశంలో మరెక్కడా లేనివిధంగా నిర్మితమైంది. సోమవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నది.
పెద్దపల్లి, మే 7 (నమస్తే తెలంగాణ)/ ఫర్టిలైజర్‌సిటీ: శాంతిభద్రతల పరిరక్షణకు పారిశ్రామిక ప్రాంతాలైన పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాలను కలుపుకొని రామగుండంలో పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ సేవల కోసం గోదావరిఖని-రామగుండం మధ్య పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో 29ఎకరాల స్థలంలో 38.50కోట్లతో కమిషనరేట్ భవనాన్ని నిర్మించారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా జీప్లస్-2 పద్ధతిన 59వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. అందులో ఆధునిక హంగులు, సకల సౌకర్యాలూ కల్పించారు.
గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ గది, వెయిటింగ్ గది, గ్రీవెన్స్‌హాల్, సీపీ చాంబర్, విశ్రాంతి గదులు, సీపీ స్టోర్, కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్ ఆఫీస్, ఏఈసీపీ క్రైమ్, పాస్‌పోర్టు వెరిఫికేషన్, సీసీ టూ, సీపీ అడిషనల్ డీసీపీ, గార్డురూం, ఇన్‌వార్డు అండ్ అవుట్ వార్డు, కామన్ మరుగుదొడ్లు నిర్మించారు. మొదటి అంతస్తులో సూపరింటెండెంట్ రికార్డు గది, ఏవో గది, విశ్రాంతి గది, రికార్డు గది, ఏఅండ్జీ సెక్షన్, ఎల్ సెక్షన్, మినీ మీటింగ్ హాల్, సిబ్బంది డైనింగ్ హాల్, లీగల్ అడ్వయిజర్, ఎస్బీ రికార్డు గది, పీడీ సెల్, సోషల్ మీడియా స్పెషల్ బ్రాంచీలు ఉన్నాయి. రెండో అంతస్తులో మీటింగ్ హాల్, డిజిటల్ ట్రైనింగ్‌తో శిక్షణ ల్యాబ్, శిక్షణ గది, సీడీఆర్(కాల్ డిటెల్ రికార్డు), సీఐ క్యాబిన్, స్టోర్ గదులు, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం, ఏసీపీ, డీసీపీ, అడిషనల్ డీసీపీల క్యాబిన్లు, కమాండ్ అండ్ కంట్రోల్ అండ్ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్, జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో విభాగాలు ఉన్నాయి. సీపీ కార్యాలయానికి వచ్చే విజిటర్స్‌కు ప్రత్యేక గదులు, వెయింటింగ్ రూమ్స్, అధికారులు, సిబ్బందికి, విజిటర్స్‌కు ప్రత్యేకంగా పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు.
పోలీసింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత
తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా అసౌకర్యం కలుగకుండా సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ పోలీసింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బందికి ఆధునిక వాహనాలు, వసతి సౌకర్యాలను కల్పించి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నారు. ఫలితంగా నేరాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో కొత్తగా సిద్ధిపేట, రామగుండం కమిషనరేట్లకు నూతన భవనాలు నిర్మించాం. 15 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్(డీపీవో)ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అందులో డీపీవోలు వివిధ స్థాయిల్లో ఉండగా, సిరిసిల్ల, గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్‌లో పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రామగుండం కమిషనరేట్ దేశంలోనే అత్యాధునికమైన పెద్ద భవనం.
– కోలేటి దామోదర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
నేర విచారణ సులువవుతుంది
రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా రామగుండం నిలుస్తున్నది. ఇలాంటి టైంలో ఆధునిక వసతులతో పోలీసు కమిషనరేట్ భవనం అందుబాటులోకి రావడం సంతోషకరం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా, ముందుచూపుతో ఆధునిక వసతులు, సకల సౌకర్యాలతో నిర్మించారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండడం, ఆధునిక సౌకర్యాలు సమకూరడంతో నేర విచారణ ఎంతో సులువవుతుంది. శాఖల సమన్వయానికి దోహదపడనుంది.
– రెమో రాజేశ్వరి, రామగుండం సీపీ