సుల్తానాబాద్, జూన్ 5 : తమ్ముడి పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. వారి మూడేళ్ల కూతురు గాయపడగా, దవాఖానకు తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుంగ్లాంపల్లిలో జరిగిన ఈ ఘటనతో మృతుల స్వగ్రామమైన బసంత్‌నగర్‌లో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసంత్‌నగర్‌కు చెందిన గుంటిపెల్లి రాము, అతని భార్య అనూష (26), మూడేళ్ల కూతురు సహస్రతో కలిసి ద్విచక్ర వాహనంపై సిద్దిపేట జిల్లా హూస్నాబాద్‌లో జరుగనున్న తమ్ముడి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరారు.
ఈ క్రమంలో సుగ్లాంపల్లి వద్దకు రాగానే కరీంనగర్ నుంచి వస్తున్న లారీ రోడ్డుపై అదుపు తప్పి రాంగ్‌రూట్‌లోకి వెళ్లి అటుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందా రు. వారి కూతురు సహస్రకు స్వల్ప గాయాలు కాగా, సుల్తానాబాద్ ప్ర భుత్వ దవాఖానకు తరలించారు. కాగా, మృతదేహాల వద్ద కూతురు సహస్ర అమ్మా.. అమ్మా అంటూ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. రాము కుటుంబ సభ్యులు దవాఖానకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. విష యం తెలుసుకున్న సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. లారీని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.