కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 3: వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే అండగా ఉంటానని, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తానని ట్రస్మా గౌరవాధ్యక్షుడు, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం శేఖర్‌రావు ఆధ్వర్యంలో వెయ్యి బైకులు, 200 కార్లతో రేకుర్తి వరకు భారీ ర్యాలీ తీశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ బైపాస్ నుంచి ర్యాలీ ప్రారంభించారు.
కమాన్ మీదుగా కూరగాయల మార్కెట్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని, అమరుడు శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిష్టయ్యకు నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా రేకుర్తికి వెళ్లారు. అక్కడి నుంచి కొండగట్టుకు వెళ్లి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. మార్గంమధ్యలో గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మండల ట్రస్మా ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. శేఖర్‌రావును శాలువాలతో సత్కరించారు. ఆయనవెంట కరీంనగర్ ట్రస్మా ఉపాధ్యక్షుడు పచ్చునూరి సురేందర్, నాయకులు లక్ష్మారెడ్డి, రవీందర్, వీరేశం, రంగు శ్రీను, రాజశేఖర్, రాజేశం, బుచ్చిరెడ్డి, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.