Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 1: కూచిపూడి నృత్యం భారతీయ సంస్కృతికి నిజంగా ఒక చిహ్నం లాంటిదని గోదావరిఖని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్ కుమార్ అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన వందేమాతరం వేడుకలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆహ్వానం అందుకొని అక్కడ కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి భారత ప్రధాని చేతుల మీదుగా ప్రశంసల పత్రం అందుకున్న గోదావరిఖని నృత్య ఖని వ్యవస్థాపకురాలు, ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వల ను ఆదివారం గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి సంవత్సరం నిర్వహించే రిపబ్లిక్ డే సందర్భంగా కూచిపూడి నృత్య ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుండి 30 మంది నృత్య కళాకారులు ఎంపిక చేయగా పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఉజ్వల ఆ ప్రదర్శనకు ఎంపిక కావడం, ఆ ప్రదర్శన విజయవంతమై ప్రముఖుల మన్ననలు పొందడం గర్వకారణం అన్నారు. సంప్రదాయ కళలను మరచిపోతున్న ఈ రోజుల్లో కూచిపూడి నృత్యాన్ని మరింత విస్తరింపజేసేందుకు ఉజ్వల చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
కూచిపూడి నృత్యంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ఉజ్వల గడిచిన రెండు దశాబ్దాలుగా పారిశ్రామిక ప్రాంతంలో నృత్య ఖని ని పేరుతో వందలాది మందికి కూచిపూడి నృత్యం లో శిక్షణ ఇస్తున్నారని, నృత్య ప్రదర్శన లో ఉజ్వల ది అద్భుతమైన అభినయం అని అయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉజ్వల మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్రనికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అయన ఆకాంక్షించారు. ఉజ్వలకు ఎల్లవేళల సహకారంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి పెద్దలు, నిర్మలాదేవి, తగరపు శంకర్, రమేష్ తో పాటు విద్యార్థినిలు పాల్గొన్నారు.