కొడిమ్యాల, డిసెంబర్ 21: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల వద్ద ఓ గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి డబుల్ బెడ్రూం ఇండ్లకు విద్యుత్ కోసం అమర్చిన ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యాయి. స్తంభాలు విరిగిపోయాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ గ్రానైట్ క్వారీ నుంచి శనివారం మధ్యాహ్నం ఓ లారీ గ్రానైట్ బండ (సుమారు 150 టన్నులు)తో పూడూరు వైపు వెళ్తున్నది.
చెప్యాల డబుల్ బెడ్రూం ఇండ్ల మూలమలుపు వద్దకు చేరుకోగానే, అతివేగంగా అదుపు తప్పింది. రోడ్డు పక్కన డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్, 15 కేవీ చిన్న ట్రాన్స్ఫార్మర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో అవి దెబ్బతిన్నాయి. మూడు విద్యుత్ పోల్స్ విరిగి, తీగలు చెల్లాచెదురయ్యాయి. లారీ వెనకాల ట్రాలీ ఊడిపోవడంతో బండ ఎగిరివచ్చి డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్లే సీసీ రోడ్డుపై పడిపోయింది.
ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టిన టైంలో కరెంట్ కట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, లారీ బీభత్సంతో ట్రాన్స్‌కోకు 7.20లక్షల నష్టం వాటిల్లిందని ట్రాన్స్‌కో ఏడీఈ మహేందర్, ఏఈ రఘునాథ్ తెలిపారు. ట్రాన్స్‌కో అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ వినోద్‌కుమార్ పటేల్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సందీప్ తెలిపారు.