siricilla | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 2 : దేశ రక్షణలో భాగస్వామిగా వృత్తిని నిర్వహించిన తమ గ్రామానికి చెందిన జవానన్ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఊరంతా కలిసి జవాను దంపతులను మండల కేంద్రం నుంచి స్వగ్రామం నారాయణపూర్ వరకు బుధవారం పూలు చల్లుతూ టపాసులు పేలుస్తూ ఘనంగా స్వాగతించి ఊరేగింపుగా తీసుకెళ్లారు.
నారాయణపూర్ కు చెందిన పంతంగి రవి 22 సంవత్సరాలు ఆర్మీ జవానుగా దేశంలో విధులు నిర్వహించి గత నెల 31న ఉద్యోగ విరమణ పొందారు. కాగా గ్రామస్తులు కొత్త బస్టాండ్ నుంచి ఉద్యోగ విరమణ పొందిన రవి కావ్య శ్రీ దంపతులను ప్రత్యేక వాహనంపై పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి ఊరేగింపుగా తీసుకెళ్లారు.
టపాసులు పేలుస్తూ పూలు చల్లుతూ యువకులు బైక్ ర్యాలీతో స్వగ్రామానికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అధికారులు, యువకులు, స్వచ్ఛందంగా రవి కావ్య శ్రీ దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం నారాయణపూర్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో పలువురు రవి దేశం కోసం అందించిన సేవలను కొనియాడారు. విరమణ అనంతర జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా గడుపుతూ సామాజిక సేవలో భాగస్వాములుగా ఉండాలని ఆకాంక్షించారు.