పెద్దపల్లిటౌన్, మే 10 : భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య వీరమరణం పొందిన అమరులకు సకలజనం వందనం చేస్తున్నది. రెండ్రోజుల క్రితం యురిలో అక్రమంగా చొరబడ్డ ముష్కరులను ఎదుర్కొనే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన యువ సైనికుడు మురళీనాయక్‌కు ఘన నివాళులర్పించింది. ‘వీరుడా వందనం’ అంటూ కీర్తిస్తున్నది. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మురళీనాయక్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. నీ మరణం వృథాగా పోదని, నీ త్యాగం ఎన్నటికీ ఈ గడ్డ మరువదని, సైనికా వందనం అంటూ ప్రతిజ్ఞ చేశారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో అంబేదర్ విగ్రహం వద్ద పలు సంఘాల నాయకులు మురళీ నాయక్ చిత్ర పటానికి పూలు వేసి ఘన నివాళుర్పించారు. గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో చిన్నారులు ర్యాలీ తీసి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
కరీంనగర్ కార్పొరేషన్, మే 10 : దేశంలోని ప్రతి ఒక్కరం ఆపరేషన్ సిందూర్ కోసం ఐక్యంగా జాతీయతను చాటుదామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. శనివారం కరీంనగర్‌లోని మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారత సైనికులకు మద్దతుగా ప్రత్యేక పూజలు చేశారు. గోవిందాపతి సేవా సంస్థ, శ్రీ సేవామార్గ సంస్థ, కిట్టీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సిందూరంతో చేతి ముద్రలను వేసి భారత ప్రభుత్వానికి పంపించారు. దేవాలయం వద్ద జాతీయ జెండాలతో సైనికులకు మద్దతుగా నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాయాది దేశానికి వణుకు పుట్టేలా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దేశానికి గర్వకారణమన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మద్దతు ఇవ్వాలన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన తెలుగు బిడ్డ మురళీనాయక్ ఆత్మకు శాంతి కలుగాలని ఆకాంక్షించారు. వారి బలిదానం వృథాగా పోదని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకు తన నెల వేతనాన్ని భారత ఆర్మీకి అందిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన చెక్కును కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందపతి సేవా సంస్థ ఫౌండర్ ఛైర్మన్ పాలవేడు శ్రీనివాస్, పడకంటి ఇందు, పద్మ, సరళ, కిట్టి మహిళలు భాగ్య, సుమ, శ్రీ సేవామార్గ్ సంస్థ అధ్యక్షురాలు ఫణిత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మంథని, మే 10: పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. ఈ మేరకు భారత ఆర్మీ జవాన్లకు మద్దతుగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి మంథనిలో జాతీయ జెండాలను పట్టుకొని రాజగృహ నుంచి ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. పహల్గాంలో దాడి చేసిన 15 రోజులకే ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత ఆర్మీ పాకిస్థాన్ ఉగ్రవాదులను హతం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులపై భారత ఆర్మీ దాడి చేసి గట్టి బుద్ధి చెప్పిందని, భారత సైన్యం ప్రదర్శించిన పాటవానికి ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నారన్నారు. యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ అమరుడు కావడం బాధాకరమన్నారు. అనంతరం మురళీనాయక్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేశ్, ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, పూదరి సత్యనారాయణ, ఎస్కే యాకుబ్, మాచీడి రాజుగౌడ్, కన్నూరి శ్రీశైలం, ఆరెపల్లి కుమార్, ఎంఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.