Ramagiri | రామగిరి, జనవరి 15 : రామగిరి పాఠశాల నిర్వాహకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ నివేదిక కన్వీనర్, విద్యావంతుల వేదిక కన్వీనర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించిన కదర కళాధర్ రెడ్డి (సెంటినరీ కాలనీ నివాసి) మంగళవారం సాయంత్రం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో రామగిరి మండలంతో పాటు తెలంగాణ ఉద్యమకారుల వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
మకర సంక్రాంతి పండుగను పక్కనపెట్టి అనేక మంది ఉద్యమకారులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయన స్వగ్రామమైన పెద్ద లింగాపూర్‌కు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మంథని నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పొతు జ్యోతి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూనె రాజేశం, తెలంగాణ ఉద్యమ కళాకారులు చిట్యాల యాకూబ్, అరుణోదయ రాష్ట్ర కమిటీ సభ్యులు, పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, సీనియర్ ఉద్యమకారుడు పోరెడ్డి వెంకన్న, పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది ఎర్రం శ్రీధర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై కదర కళాధర్ రెడ్డికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమంలో కళాధర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన లోటు ఉద్యమకారులకే కాదు సమాజానికీ తీరనిదని వారు పేర్కొన్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.