Vemulawada | వేములవాడ, నవంబర్ 30: వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి రెండు సంవత్సరాలుగా ఆదరణ కరువైంది. రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో ఉద్యమాలకు వేదికగా చెక్కపల్లి బస్టాండ్ నిలిచింది. జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టేందుకు వేదికను కూడా నిర్మించారు. ఇదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ అధికారులు వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడికి మార్చారు.
ప్రతీ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తప్పనిసరిగా రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేవారు. గత రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మారడంతో తెలంగాణ తల్లి విగ్రహానికి పూర్తిగా ఆదరణ కోల్పోయింది. రంగులు కూడా వేకపోవడంతో వెలిసిపోయి ఉండగా మంత సందీప్ అనే బీఆర్ఎస్ నాయకుడు తానే సొంత ఖర్చులతో ఆదివారం తెలంగాణ తల్లికి రంగులు వేయించారు. కొత్తగా వేసిన రంగులతో తెలంగాణ తల్లి విగ్రహం మరింత శోభాయమానంగా మారడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.