చిగురుమామిడి, మార్చి 3: చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలో చీకుట్ల రాజుకు చెందిన లేగ దూడ హైనా దాడిలో(Hyena attack) మృతి చెందినట్లు ఎస్ఎఫ్ఓ శేఖర్ తెలిపారు. రోజువారి లాగే తన వ్యవసాయ పొలం వద్ద దూడను కట్టివేసి ఇంటికి వెళ్లగా తిరిగి సోమవారం తెల్లవారుజామున బావి వద్దకు వెళ్లేసరికి లేగ దూడను హైనా చంపినట్లు ఆనవాళ్లను గుర్తించామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పశువైద్యాధికారి సాంబరావు తో కలిసి పంచనామ నిర్వహించామని ఎస్ఎఫ్ఓ తెలిపారు.
లేగదూడ విలువ సుమారు 20వేల వరకు ఉంటుందని, ప్రభుత్వానికి నివేదిక అందజేసి బాధితులకి న్యాయం జరిగేలా చూస్తామని వారు పేర్కొన్నారు. సుందరగిరి, బంజేరుపల్లి, గాగిరెడ్డిపల్లి, నవాబుపేట్, కొండాపూర్, చిగురుమామిడి, లంబాడి పల్లి గ్రామాలకు చెందిన రైతులు పశువులను పశువుల పాకలో కట్టివేయాలని, లేదంటే చుట్టూ కంచే ఏర్పాటు చేసి అందులో పశువులను ఉంచాలని సూచించారు. పశువుల ప్రాణాలకు నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఓ శేఖర్ రైతులను కోరారు.