బీసీల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఇంటింటా సర్వేకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీసీలకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని వర్గాల వివరాలు సేకరించాలని నిర్ణయించి, అందుకు సమయాత్తం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. జిల్లాలోని ముఖ్యప్రణాళిక కార్యాలయంతో అనుసంధానమై సర్వేను పూర్తి చేయాలని చెప్పడంతో సదరు శాఖ అంతా సిద్ధం చేస్తున్నది. 2011లో జరిగిన జనాభా గణాంకాలను పరిగణలోకి తీసుకొని చూస్తే.. ఉమ్మడి జిల్లాలో ఈ సర్వేను 60 రోజుల్లో పూర్తి చేసేందుకు 10 వేల మందికిపైగా సిబ్బంది అవసరం పడుతారని యంత్రాగం అంచనా వేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల గణన బ్లాక్ (ఎన్యూమరేషన్ బ్లాక్)ల వివరాలు తెప్పిస్తున్నది. వాటి ఆధారంగా ప్రతి 150 నుంచి 160 గృహాలకు ఒక బ్లాక్ చేసి సర్వే చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ముందుకెళ్తున్నది. కాగా, ఈ సర్వే చేసేందుకు అధికారయంత్రాంగానికి అనేక సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి విభాగం అధికారులు. వివిధ రకాల పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో సర్వేకు కావాల్సిన 10వేల మంది సిబ్బందిని సమీకరించడం కత్తిమీద సాములాంటిదే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పదేండ్లకోసారి జనాభా గణన జరగాలి. 1901 నుంచి మొదలు 2011 వరకు అలాగే జరిగింది. ఆ తర్వాత 2021లో జనాభా లెక్కింపు జరగాలి. అందుకు భారత ప్రభుత్వం అప్పట్లో అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా లెక్కలకు సిద్ధమయ్యాయి. కానీ, కరోనా విపత్తు యావత్తు దేశాన్ని వెనక్కి నెట్టింది. అప్పుడున్న పరిస్థితుల్లో జనాభా లెక్కింపు వాయిదా పడింది. కాగా, ఈ గణన చేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నేటికి డిమాండ్ చేస్తున్నా కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టత లేదు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలంటే కచ్చితంగా బీసీ కులగణన జరగాల్సిన అవసరమున్నది. అధికారంలోకి రావడానికి ఆ పార్టీ తన మేనిఫెస్టోలో అనేక హామీల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన విషయం విదితమే. ఆ ప్రకారం కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్ల పెంపు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని చెప్పింది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేసింది. అంతే కాకుండా బీసీ వర్గాల్లో ఉపకులాల వారీగా వర్గీకరణ చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్నది. ఇది అమలు చేయాలంటే బీసీ కులగణన జరగాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ఉన్న ఓటరు జాబితా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని సర్కారు ముందుగా ఆలోచన చేసినా.. బీసీ సంఘాలు మాత్రం కొత్తగా కులగణన సర్వే జరిగి తీరాల్సిందేనంటూ పట్టుబట్టాయి. పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. సర్వే ఆధారంగా తమకు రిజర్వేషన్లు పెంచాల్సిందేనంటూ స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇంటింటా సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే పనిలో పనిగా సర్వేను బీసీలకు మాత్రమే పరిమితం చేయకుండా.. అన్ని వివరాలు సేకరించాలని నిర్ణయించించింది. ఆ మేరకు వచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకొని అధికార యంత్రాంగం సమాయత్తం అవుతున్నది.
ప్రస్తుతం ఈ సర్వే చేసేందుకు అధికారయంత్రాంగానికి అనేక సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం సర్వేకు పదివేల మంది సిబ్బంది అవసరం పడుతుండగా.. మున్ముందు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని విభాగాల సిబ్బందిని భాగస్వాములను చేస్తేనే సర్వేను నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేసే ఆస్కారముంటుంది. ప్రధానంగా ఉపాధ్యాయులను వినియోగించకుండా గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయాలను అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ బడుల్లో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉపాధ్యాయులున్నారు. బోధన అలాగే కొనసాగుతున్నది. వచ్చే డిసెంబర్ నుంచి ప్రతి స్కూల్‌కూ ఒక పరీక్ష కాలమే. సిలబస్ పూర్తి చేయడం, రివిజన్ చేయించడం వంటివి వారికి చాలెంజ్‌గా ఉంటాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులను వినియోగిస్తే.. పాఠశాల విద్యపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు బడుల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, ప్రస్తుత పరిస్థితుల్లో సర్వే నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కోరుతున్నారు. రెవెన్యూ పరంగా చూస్తే.. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవి పూర్తి కావడానికి కనీసం రెండు నెలలు పడుతుంది. రెవెన్యూ యంత్రాంగం ఇక్కడ లేకపోతే.. కొనుగోళ్లపై భారీ ప్రభావం పడడంతోపాటు రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదమున్నది. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ విభాగం నుంచి పెద్దగా సిబ్బందిని తీసుకోవడానికి ఆస్కారం కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ అధికారులు డిజిటల్ క్రాప్ సర్వేతో సతమతమవుతున్నారు. ఇప్పటికే 49 రకాల విధులు నిర్వర్తిస్తున్నామని, డిజిటల్ సర్వే నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ విభాగం అధికారుల పరిస్థితి అలాగే ఉన్నది. సర్వే పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. అందుకోసం సదరు శాఖ సన్నద్ధం కావాల్సిన అవసరమున్నది. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలు ఎంపీడీవోల వరకు బీజీగానే ఉన్నారు. ఒక వేళ ప్రభుత్వోద్యోగులను కాకుండా ప్రైవేట్ సిబ్బందిని నియమిస్తే.. వివరాల సేకరణలో ఏమైనా తప్పులు జరిగితే వారిపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై యంత్రాంగం తర్జనభర్జన పడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే స్పష్టత కోసం చూస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం సర్వే నిర్ధిష్ట సమయంలో పూర్తవుతుందా.. లేదా? అన్నది తేలుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసేందుకు 80వేల మంది ఎన్యూమరేటర్లు, 10వేల మంది సూపర్వైజర్లు అవసరమని రాష్ట్ర బీసీ కమిషన్ ఇప్పటికే తేల్చిచెప్పంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సర్వేను నిర్ధిష్ట గడువులోగా పూర్తిచేసి, వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే 10వేల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు అవసరమని అంచనా వేసింది. అంతేకాదు, సర్వే ఫార్మాట్‌కు సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. ప్రతి కుటుంబానికి సంబంధించి 54నుంచి 60 అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉంటుందని తెలుస్తుండగా.. సర్కారు నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. సేకరించాల్సిన వివరాలు పెరిగితే.. సిబ్బంది సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. సర్వే కచ్చితంగా చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా యంత్రాగం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఎన్యూమరేటర్లు, బ్లాక్‌ల వివరాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. ఆనాటి ఉమ్మడి జిల్లాలో 37,76,289 మంది జనాభా ఉన్నది. మొత్తం 9,76,022 గృహాలుండగా, ఆనాడు ఉన్న 57 మండలాలు కలిపి ఉమ్మడి జిల్లా 11,824 చదరపు కిలోమీటర్లకు విస్తరించి ఉన్నది. అప్పుడు 6,506 బ్లాక్‌లుగా విభజించి ఈ సర్వే చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 14 ఏళ్లలో పల్లెలు, పట్టణాలు, నగరాల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. లక్షాలాది గృహాలు కొత్తగా వెలిశాయి. జనాభా కూడా అదే స్థాయిలో పెరిగింది. తాజా అంచనాల ప్రకారం చూస్తే గడిచిన 14 ఏళ్లలో 25 నుంచి 30 శాతం మేరకు గృహాలు పెరిగి ఉంటాయని భావిస్తున్నారు. 2011తో పోలిస్తే జనాభా మరో 7 నుంచి 8 లక్షల వరకు పెరిగి ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే 2001తో పొలిస్తే 2011 నాటికి 2,84,447 మంది పెరిగారు. ప్రస్తుతం 14 ఏళ్ల తర్వాత లెక్కలు జరుగుతున్న నేపథ్యంలో గృహాలు, జనాభా అంచనాకు మించే ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.