కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / రాజన్న సిరిసిల్ల (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రజలు మరోసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానం చాటారు. ఇతర పార్టీలు చేసిన కుట్రలు బెడిసికొట్టేలా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు కొత్త కొత్త హామీలు ఇచ్చినా నమ్మలేక పోయారు. రెండేళ్ల పాలనపై ప్రజావ్యతిరేకత చూపారు. ప్రలోభాలకు లొంగకుండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారు. ప్రధానంగా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరులో పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. అంతటా ఇలానే ఆదరించారు. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో గుండెల్లో పెట్టుకున్నారు.
కేసీఆర్‌తోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అభిమానం చూపారు. ఆ ఫలితంగానే బీఆర్ఎస్ బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో 88 స్థానాలకు 38 స్థానాలను దక్కించుకున్నది. ఇక తంగళ్లపల్లి మండలం అయితే 30 స్థానాలకు 16 స్థానాలు గెలుచుకొని ఆదర్శంగా నిలిచింది. అనేక స్థానాల్లో బీఆర్ఎస్ ‘నువ్వా నేనా’ అన్నట్టు పోటీనిచ్చింది. ఊహించిన స్థానాలను గెలుచుకోలేక కాంగ్రెస్ పరిస్థితి ‘చావుదప్పి కన్ను లొట్టపోయిన’ చందంగా మారింది. దాదాపు యాబై స్థానాల్లో స్వల్పంగా 20నుంచి 30 ఓట్ల తేడాతో హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారే, తప్ప పెద్ద మెజార్టీ సాధించలేకపోయారు.
పంచాయతీపోరులో బీజేపీ అట్టడుగు స్థాయికి చేరుకున్నది. మొదటి విడుతలోనే కాదు, రెండో విడుతలోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 416 సర్పంచ్ స్థానాలకు కేవలం 31 స్థానాలకే పరిమితమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్లలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అధిక నిధులు ఇస్తామని సంజయ్ ప్రకటనలు చేసినా పల్లె ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు పదహారు గ్రామాల్లో అభ్యర్థులే పోటీలో లేరు. స్వతంత్రులు గెలుచుకున్న సీట్లు కూడా గెలుచుకోలేక పోయింది. ఇండిపెండెంట్లు ఆరు స్థానాల్లో గెలువగా, కమలం పార్టీ కేవలం 6 సీట్లకే పరిమితమైంది.
రెండో విడుతలో తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. మొత్తం 30 సర్పంచ్ స్థానాలకు 16 స్థానాలను కైవసం చేసుకున్నది. కాగా, తంగళ్లపల్లి, నర్సింహులపల్లె, ఇందిరమ్మకాలనీ, సారంపల్లిలో హోరాహోరీగా జరిగిన పోరులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ ఏమాత్రం సత్తాచాటుకోలేకపోయింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కేవలం ఏడుగురే గెలుపొందడం, పదికిపైగా మూడో స్థానంలో నిలువడం చూస్తే.. రెండేళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడినట్టు తెలుస్తున్నది. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు నలుగురు, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గెలుపొందారు. గులాబీ ప్రభంజనంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ ప్రభావం మూడో విడుత ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో జరిగే ఎన్నికలపై పడుతుందని భావిస్తున్నారు. నాలుగు మండలాల్లో కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని చెబుతున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. తొలి, మలి విడతల్లో గెలిచిన సర్పంచులను అభినందించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్లో సర్పంచులతో సమావేశం కానున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, రూరల్, బోయినిపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో గెలిచిన సర్పంచులను ఘనంగా సన్మానించనున్నారు. అందుకు పార్టీ జిల్లా, పట్టణ అధ్యక్షుడు తోట ఆగయ్య, జిందం చక్రపాణి ఏర్పాట్లు చేస్తున్నారు.
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు తన నియోజకవర్గంలో పరాభవం ఎదురైంది. ఎమ్మెల్యే సొంత గ్రామం పచ్చునూర్లో గులాబీ జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పార్నంది కేశవ్ అలియాస్ కిషన్ 150 ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కనకం అశోక్ ఐదో స్థానంలో నిలిచాడు. ఇక నియోజకవర్గ కేంద్రమైన మానకొండూర్‌లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తాళ్లపల్లి వర్షిణి ఘనవిజయం సాధించింది. అలాగే కవ్వంపల్లి క్యాంపు ఆఫీస్ ఉన్న మహాత్మానగర్ కూడా చేజారింది.
ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరు గ్రామం గులాబీ జెండాకే జైకొట్టింది. ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భారతమ్మ-కొమురయ్యకు 400 పై చిలుకు ఓట్ల మెజార్టీనిచ్చి కేసీఆర్‌పై అభిమానం చాటుకున్నది. కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.