Independence Day | జగిత్యాల కలెక్టరేట్ : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యతిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతికి వందనం చేశారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పుర ప్రముఖులు, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి తిలకించి వివరాలను తెలుసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. పాఠశాలల విద్యార్థులు దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు.
చిన్నారులను మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకలల్లో జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బీ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బీఎస్ లత, స్థానిక ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.