ప్రత్యేక అవసరాలు గల పిల్లల వికాసం కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 47మండలాల్లో కేంద్రాలు ఉండగా, కొత్తగా ఏర్పాటైన 14 మండలాల్లోనూ గతేడాది ఈ సెంటర్లను ప్రారంభించింది. అవసరమైన సామగ్రి (బోధనోపకరణాలు, ఆట వస్తువులు, కుర్చీలు) కొనుగోలు చేసేందుకు ఒక్కో కేంద్రానికి 50వేల చొప్పున నిధులు మంజూరు చేసింది.
పెద్దపల్లి, జనవరి 5(నమస్తే తెలంగాణ): మానసిక, శారీరక వైకల్యం ఉన్న బాలబాలికలకు వివిధ పద్ధతుల్లో విద్యనందించి సాధారణ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విలీన విద్యా వనరుల కేంద్రాలను (ఐఈఆర్సీ) ఏర్పాటు చేసింది. బుద్ధి మాద్యం, శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారితో మాట్లాడించడం, నడిపించడం, ప్రాథమిక విద్యను అందించేందుకు నిపుణులను గతంలోనే నియమించింది.
అలాగే కొత్తగా ఏర్పడిన 14 మండల కేంద్రాల్లోనూ ఏడాది క్రితం సెంటర్లను ప్రారంభించింది. ఆ కేంద్రాల్లో అవసరమైన సామగ్రిని సమకూర్చేందుకు ఒక్కో సెంటర్కు 50వేల చొప్పున మొత్తం 7లక్షలు ఇటీవలే మంజూరు చేసింది. పెద్దపల్లి జిల్లాలో మూడు, కరీంనగర్ జిల్లాలోని నాలుగు, జగిత్యాల జిల్లాలో మూడు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు మండలాలకు నిధులు కేటాయించింది. ఈ నిధులతో భవిత కేంద్రాల్లో బోధనోపకరణాలు, ఆట వస్తువులు, కుర్చీలు, బల్లలు, బీరువాలు సమకూర్చుకునే అవకాశమున్నది. అలాగే ఇంటి వద్ద ఉంటూ చదువుకునే వారిలో జిజ్ఞాస పెంపొందించేందుకు ప్రత్యేక నిధులు ఇచ్చింది.
పెద్దపల్లి జిల్లాలోని భవిత కేంద్రాల్లో 745 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నారు. కొత్తగా ఏర్పాటైన భవిత కేంద్రాల్లో సామగ్రి కొనుగోలు కోసం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ నిధులు రాగానే ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. వారి నిర్ణయం మేరకు సామగ్రి కొనుగోలు చేస్తాం.
-మాధవి, డీఈవో (పెద్దపల్లి)